పెంటగాన్ డీల్ ఎఫెక్ట్.. ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు! అసలేం జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన ChatGPT ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్' (Pentagon) తో OpenAI కుదుర్చుకున్న ఒక వివాదాస్పద ఒప్పందమే దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే 25 లక్షల మందికి పైగా యూజర్లు తాము ఇకపై ఈ చాట్‌బాట్ ను వాడబోమని ప్రతిజ్ఞ చేయడం టెక్ ప్రపంచంలో కలకలం రేపుతోంది.

అసలు వివాదం ఏమిటి?
గత వారం OpenAI సంస్థ అమెరికా రక్షణ శాఖతో ఒక కీలక ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం, పెంటగాన్ తన క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లలో ChatGPT మోడల్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీని నిఘా (Surveillance) కోసం లేదా యుద్ధ సంబంధిత కార్యకలాపాల కోసం వాడుతారేమో అన్న భయం యూజర్లలో మొదలైంది. సోషల్ మీడియాలో వస్తున్న సంతకాలు, యాప్ వినియోగ డేటా ప్రకారం.. ప్రజలు ఓపెన్ ఏఐ (OpenAI) తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రికార్డు స్థాయిలో అన్‌ఇన్‌స్టాల్‌లు
సెన్సార్ టవర్ (Sensor Tower) నివేదిక ప్రకారం.. ఈ ఒప్పందం వార్త బయటకు వచ్చిన మరుసటి రోజే అమెరికాలో ChatGPT మొబైల్ యాప్ అన్‌ఇన్‌స్టాల్‌లు ఏకంగా 295 శాతం పెరిగాయి. చాలా మంది యూజర్లు తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని భావిస్తూ, ప్రత్యామ్నాయంగా ఉన్న ఆంత్రోపిక్ (Anthropic) సంస్థకు చెందిన 'క్లాడ్' (Claude) చాట్‌బాట్ వైపు మళ్లుతున్నారు. దీంతో యాపిల్ యాప్ స్టోర్ చార్ట్‌లలో 'క్లాడ్' అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం.
ఆంత్రోపిక్ తిరస్కరణ.. OpenAI ఆమోదం
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదట పెంటగాన్ ఈ డీల్ కోసం ఆంత్రోపిక్ సంస్థను సంప్రదించింది. అయితే తమ ఏఐ మోడల్‌ను నిఘా కోసం వాడటం తమ ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధమని ఆ సంస్థ నిరాకరించింది. ఆ వెంటనే OpenAI ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఇది కేవలం వ్యాపార అవకాశంగా చూసి తీసుకున్న నిర్ణయమని, యూజర్ల భద్రతను పక్కన పెట్టారని నెటిజన్లు మండిపడుతున్నారు.
శామ్ ఆల్ట్‌మాన్ వివరణ.. మార్పులు..
యూజర్ల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత చూసి OpenAI సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఒప్పందాన్ని శుక్రవారం రోజున అంత తొందరగా ప్రకటించి ఉండాల్సింది కాదని, అది కొంత అస్పష్టంగా ఉండిపోయిందని ఆయన ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందంలో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) వంటి సంస్థలు సామూహిక నిఘా కోసం ఈ టెక్నాలజీని వాడకుండా కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంత్రోపిక్ ఆఫర్..
ఇక మరోపక్క యాప్ స్టోర్‌లో ChatGPT ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్న తరుణంలో, ఆంత్రోపిక్ సంస్థ తన వినియోగదారులకు ఒక అదిరిపోయే వార్తను అందించింది. ఇప్పటివరకు కేవలం పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న 'మెమరీ' (Memory) ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల క్లాడ్ మీ గత సంభాషణలను, ప్రాధాన్యతలను గుర్తుంచుకుని మరింత మెరుగ్గా స్పందిస్తుంది. అంతేకాకుండా, యూజర్లు తమ ఇతర చాట్‌బాట్‌ల (ఉదాహరణకు ChatGPT) నుంచి పాత డేటాను లేదా మెమరీలను క్లాడ్‌లోకి నేరుగా ఇంపోర్ట్ (Import) చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇది యూజర్లకు చాలా సులభంగా మారనుంది.
ఏది ఏమైనా మొన్నటివరకూ తిరుగులేని శక్తిగా వెలిగిన చాట్ జీపీటీ (ChatGPT) కి ఇప్పుడు తన సొంత యూజర్ల నుంచే ఇలాంటి నిరసన ఎదురుకావడం ఏఐ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నైతిక విలువలు , ప్రైవసీ ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications