లోన్ మారటోరియంపై మరో వారం గడువు, కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పేనా
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్ట్ 31తో ముగిసిన లోన్ మారటోరియంపై సుప్రీం కోర్టులో ఈరోజు (సెప్టెంబర్ 28, సోమవారం) విచారణ జరిగింది. అయితే కేంద్రం గడువు కోరడంతో మారటోరియం కాలంలో వడ్డీ మాఫీపై విచారణను అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. లోన్ మారటోరియం, వడ్డీ మాఫీపై కేంద్రం కసరత్తు చేస్తోందని, ఇందుకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
మారటోరియం, వడ్డీపై కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు అడిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుది దశలో ఉందని సొలిసిటర్ జనరల్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. కేంద్రానికి మరికొంత గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. లోన్ మారటోరియం కాలంలో వడ్డీమాఫీ అంశంపై తదుపరి విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

ఆర్థిక అంశాలతో ముడివడిన అంశం
లోన్ మారటోరియం పొడిగింపు, వడ్డీ మాఫీ అంశంపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. కేంద్రం గడువు కోరడంతో విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో పాటు ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీం కోర్టు తెలిపింది. కేంద్రం గడువు కోరడంతో అక్టోబర్ 1వ తేదీ నాటికి అన్ని వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.ఇది కాస్త క్లిష్టమైన అంశమని, అనేక ఆర్థిక అంశాలు ఉన్నాయని, కాబట్టి కాస్త సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు.

రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం..
ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని, ఈ మేరకు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలియజేసిందని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే అఫిడవిట్‌ను గురువారం పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తామని జస్టిస్ ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఇందుకు సంబంధించి వాదనలు సోమవారం ఉంటాయని, మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపారు.

కేంద్రం కీలక నిర్ణయం దిశగా..
అయితే కేంద్రం లోన్ మారటోరియం కాలంలో వడ్డీ రేటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం వడ్డీపై వడ్డీ అంశానికి సంబంధించి కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. సొలిసిటర్ జనరల్ వాదనలను బట్టి వడ్డీపై వడ్డీకి సంబంధించి కస్టమర్లకు కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications