చంద్రుడిపై కూర్చుని మందేద్దామా.. ఓ రాత్రికి రూ. 9 కోట్లు..అదే పుల్లు ట్రిప్ అయితే రూ. 90 కోట్లు..
అంతరిక్షంలో శాశ్వత మానవ నివాసానికి ఏర్పాటు దిశలో మరో కీలక అడుగు పడింది. అమెరికాకు చెందిన ఒక అంతరిక్ష స్టార్టప్ చంద్రునిపై హోటల్‌గా పనిచేసే నివాస సౌకర్యం కోసం ముందస్తు రిజర్వేషన్‌లను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ను భవిష్యత్తులో చంద్రునిపై శాశ్వతంగా మనుషులు నివసించే దిశగా తీసుకువెళ్లే తొలి ప్రయత్నమని కంపెనీ చెబుతోంది.
ఈ స్టార్టప్ పేరు గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ (GRU స్పేస్). అవసరమైన నియంత్రణ అనుమతులు లభిస్తే.. 2032 నాటికి చంద్రుని ఉపరితలంపై నివసించడానికి అనుకూలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన అంతరిక్ష పర్యాటకం కాకుండా.. భూమికి అవతల మానవ ఉనికి సాధ్యమయ్యే దిశగా వేసే బలమైన అడుగుగా GRU స్పేస్ అభివర్ణిస్తోంది.

కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. Moon Hotel కోసం ఒక్కో అతిథికి వసతి ఖర్చు సుమారు రూ.2.2 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు ఉండొచ్చు. అయితే ఇది కేవలం చంద్రునిపై బసకు సంబంధించిన అంచనా మాత్రమే. భూమి నుంచి చంద్రునికి వెళ్లి తిరిగి వచ్చే పూర్తి యాత్ర ఖర్చు చివరికి రూ.90 కోట్లను కూడా దాటే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది. అంతరిక్ష ప్రయాణం ఇప్పటికీ అత్యంత ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ.. భవిష్యత్తులో ఈ ఖర్చులు తగ్గుతాయని GRU స్పేస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
జనవరి 12 నుంచి ఈ చంద్ర హోటల్‌కు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సంపన్న వ్యక్తులు, సాహసోపేతమైన ప్రయాణికులు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావాలని కంపెనీ ఆహ్వానిస్తోంది. బుకింగ్ పేజీలో GRU స్పేస్ పేర్కొన్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది మనకు తెలిసిన అంతరిక్ష పర్యాటకం కాదు. ఇప్పటివరకు కేవలం 12 మంది మాత్రమే చంద్రునిపై అడుగుపెట్టారు. ఈ ప్రారంభ దశలో భాగమవడం ద్వారా.. భూమికి అవతల జీవితం ఏర్పడే చరిత్రలో మీరు భాగమవుతారని కంపెనీ పేర్కొంది.
దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. మొదటిగా, తిరిగి చెల్లించని విధంగా 1,000 డాలర్ల దరఖాస్తు రుసుము చెల్లించాలి. అంతేకాదు, ముందుగానే స్థానం ఖరారు చేసుకోవాలంటే 1 మిలియన్ డాలర్ల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, వైద్య సమాచారం, ఆర్థిక స్థితిగతులు వంటి అంశాలపై విస్తృత స్థాయి పరిశీలన జరిపిన తర్వాతే తుది ఎంపిక జరుగుతుందని GRU స్పేస్ తెలిపింది. ఈ స్క్రీనింగ్ ద్వారా ప్రయాణానికి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అర్హులైన వారినే ఎంపిక చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
GRU స్పేస్‌ను 2025లో 22 ఏళ్ల కెనడియన్-అమెరికన్ యువ వ్యవస్థాపకుడు స్కైలర్ చాన్ స్థాపించారు. ఆయన గతంలో టెస్లాలో ఇంటర్న్‌గా పనిచేశారు. చంద్రుని మీద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటూ టెక్ వ్యవస్థాపకులలో పెరుగుతున్న ఆసక్తికి ఈ వెంచర్ నిదర్శనంగా నిలుస్తోంది. మన లక్ష్యాలు నిజంగా చంద్రుడిని చేరుకోవాలని చాన్ వ్యాఖ్యానించారు. చంద్రునిపై నివాసం ఏర్పాటే భవిష్యత్తులో చంద్ర ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసే తొలి కీలక దశగా ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్ట్ ప్రణాళిక ప్రకారం.. నిర్మాణ పనులు 2029లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భూమిపై నిర్మించిన ఈ నివాసాన్ని భారీ ల్యాండర్ సహాయంతో చంద్రునికి తరలించనున్నారు. ఇది గాలితో నింపే విధానంలో రూపొందించిన నివాసంగా ఉండి.. ఒకేసారి నలుగురు అతిథులు బహుళ రోజుల పాటు బస చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నిర్మాణం సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేసేలా డిజైన్ చేయబడింది.
అదే సమయంలో.. చంద్రుని ధూళిని నిర్మాణ సామగ్రిగా మార్చే సాంకేతికతను కూడా GRU స్పేస్ పరీక్షించనుంది. ఈ విధంగా తయారయ్యే ఇటుకలు, చంద్రునిపై ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులు, రేడియేషన్ నుంచి నివాసాలను రక్షించేందుకు ఉపయోగపడతాయని కంపెనీ భావిస్తోంది. భూమి అవతల శాశ్వత మానవ నివాసం కలగా కాకుండా నిజంగా మారే దిశగా ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications