కరోనా దెబ్బతో భారత్ వృద్ధిలో మరింత క్షీణత, చైనా సూపర్: చరిత్రలో వరస్ట్ క్వార్టర్!
2020లో భారత జీడీపీ 3.1 శాతం ప్రతికూలత (మైనస్ 3.1 శాతం) నమోదు చేస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. ఈ మేరకు గ్లోబల్ మ్యాక్రో ఔట్ లుక్ రిపోర్ట్, జూన్ నివేదికలో తెలిపింది. కరోనా నేపథ్యంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, ఈ ఏడాది రెండో అర్ధభాగం నుండి క్రమంగా కోలుకోవడం ప్రారంభిస్తుందని భావించింది. ఈ నేపథ్యంలో 2021లో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకొని 6.9 శాతానికి చేరుకుంటుందని తెలిపింది.

అత్యంత వరస్ట్ క్వార్టర్‌గా నిలుస్తుంది
మూడీస్ గ్లోబల్ మ్యాక్రో ఔట్ లుక్ రిపోర్ట్, జూన్ ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం ప్రారంభించిందని, కానీ రికవరీ మాత్రం పైకి, కిందకు కదులుతూ స్థిరత్వానికి చేరుకోవచ్చునని అభిప్రాయపడింది. లాక్ డౌన్ ప్రభావం అంతకుముందు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం నుండి ఇప్పటి వరకు ఈ రెండో క్వార్టర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత దారుణ పరిస్థితి ఎదురైందని తెలిపింది. ఈ క్వార్టర్ చరిత్రలో అత్యంత వరస్ట్‌గా నిలిచిపోతుందని తెలిపింది.

ఆసియాలో చైనా మాత్రమే సూపర్
G20 ఆర్థిక వ్యవస్థలను మూడీస్ 2020లో 4.6 శాతం ప్రతికూలతగా అంచనా వేసింది. 2021 నాటికి ఇది 5.2 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది. G20 దేశాల్లో చైనా ఒక్క దేశం మాత్రమే 2020లో వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన డ్రాగన్ కంట్రీ 1 శాతం వృద్ధి చెందుతుందని, 2021 నాటికి ఆర్థిక వ్యవస్థ 7.1 శాతంగా ఉంటుందని తెలిపింది.

ఉద్రిక్తతల ప్రభావం
భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలను కూడా మూడీస్ పరిగణలోకి తీసుకుంది. సౌత్ చైనా సీ దేశాలు సహా చుట్టుపక్కల దేశాలతో చైనాకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పెరుగుతోందని తెలిపింది. ఆసియాలో జియోపోలిటికల్ టెన్షన్స్ పెరుగుతున్నట్లు తెలిపింది. కరోనా వల్ల అమెరికా-చైనా మధ్య ట్రేడ్, టెక్నాలజీ టెన్షన్స్ పెంచిందని పేర్కొంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ప్రమాదంలో ఉందని అభిప్రాయపడింది. జూన్ నెలలో ఇండియా ఫారెన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ లాంగ్ టర్మ్ ఇష్యూయర్ రేటింగ్‌ను మూడీస్ తగ్గించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications