Moody's Report: భారత వృద్ధిపై వాటర్ వార్.. మూడీస్ రిపోర్టులో కీలక హెచ్చరికలు
Water problem: చరిత్ర చూస్తే ఎంతో గొప్ప నాగరికతలు ఆయా నదుల తీరాన ప్రారంభమయ్యాయి. జీవనాధారమైన నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు సైతం నెలకొన్న పరిస్థితి. అయితే ఇదే నీరు భారతదేశ వృద్ధికి ఆటంకంగా మారనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వ గురువుగా విలసిల్లుతున్న ఇండియాను అథః పాతాళానికి తొక్కే సత్తా నీటికి ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
దేశంలో ఇటీవల పెరుగుతున్న నీటి ఎద్దడి పట్ల ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ మూడీస్ కీలక కామెంట్స్ చేసింది. ఇదికాస్తా భవిష్యత్తులో భారత సావరిన్ క్రెడిట్ స్థాయిని బలహీనపరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు తగిలే షాక్‌లను తట్టుకుని నిలబడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది. సరైన నిర్ణయాలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే పాకిస్తాన్, చైనా కాకుండా నీరే భారత్‌పై యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని భయాందోళనలు ఉన్నాయి.

బలమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ కలిసి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యతను తగ్గిస్తున్నట్లు మూడీస్ విశ్లేషకులు తమ నివేదికలో పేర్కొన్నారు. బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి మరియు ఉక్కు తయారీ వంటి నీటి అవసరం అధికంగా ఉండే రంగాలకు ఇది హానికరం అని అభిప్రాయపడ్డారు.
'నీటి సరఫరా తగ్గితే అది వ్యవసాయ ఉత్పత్తులు మరియు పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి తక్కువ ఆదాయం, సామాజిక అశాంతికి దారితీస్తుంది. ఇది భారతదేశ వృద్ధిలో అస్థిరతను పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది' అని మూడీస్ వెల్లడించింది.
తరచూ కరువులు, సుదీర్ఘ వేడి వాతావరణం దేశంలో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ అభిప్రాయపడింది. న్యూఢిల్లీ మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాలు ప్రతి సంవత్సరం తీవ్ర కొరతతో పోరాడుతున్నట్లు పేర్కొంది. 2022 నాటికి GDPలో దేశీయ పారిశ్రామిక రంగం వాటా 25.7 శాతం ఉంది. G-20 దేశాల ఎమర్జింగ్ మార్కెట్ సగటు 32 శాతం కంటే ఇది చాలా తక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదించినట్లు మరో ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications