గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గనున్న వడ్డీ రేట్లు, ఆర్‌బీఐ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
Monetary Policy Update: లోన్ కట్టేవారికి శుభవార్త.. రానున్న Monetary Policyలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెపో రేటును 50 శాతం తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల 4 నుండి 6 వరకు ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం జరగనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమావేశంలో ఈసారి కూడా వడ్డీ రేటులో అంటే రెపో రేటులో 0.25% తగ్గింపుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ తగ్గింపుతో అన్ని రకాల రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది.ఇంతకు ముందు జరిగిన రెండు సమావేశాలలో రెపో రేటును ఇప్పటికే 0.50% తగ్గించారు. 2025లో ఫిబ్రవరిలో, తరువాత ఏప్రిల్‌లో ప్రతిసారీ 25 బేసిస్ పాయింట్లు రెపోరేటును తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల రెపో రేటు 6%కి తగ్గింది. కాగా ద్రవ్య విధాన కమిటీలో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 3 మంది ఆర్‌బిఐకి చెందినవారు కాగా మిగిలిన వారిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

రెపో రేటు తగ్గింపుకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని ఎస్‌బిఐ సెక్యూరిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ సన్నీ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం జీడీపీ వృద్ధి స్థిరంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. జూలై 2019 తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం అత్యల్ప స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే రేట్లు మరింత తగ్గవచ్చని ఆర్‌బిఐ గవర్నర్ Sanjay Malhotra సూచించారు.
రెపో రేటు అంటే ఏమిటి: బ్యాంకులకు ఆర్‌బిఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. రెపో రేటు తగ్గింపు కారణంగా.. బ్యాంకుకు తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది. బ్యాంకులు తమ కస్టమర్లకు చౌకైన రుణాలను అందిస్తాయి. బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. రెపో రేటు తగ్గిన తర్వాత బ్యాంకులు హౌసింగ్, ఆటో వంటి రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించవచ్చు. మీరు తీసుకున్న అన్ని రుణాలు చౌకగా మారవచ్చు. EMI కూడా తగ్గుతుంది. బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గితే గృహ డిమాండ్ పెరుగుతుంది. మరింత మంది కస్టమర్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి.
సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఏ కేంద్ర బ్యాంకుకైనా పాలసీ రేట్ల రూపంలో ఓ ఆయుధం ఉంటుంది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.. కేంద్ర బ్యాంకు పాలసీ రేటును పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. పాలసీ రేటు ఎక్కువగా ఉంటే బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుండి పొందే రుణం ఖరీదైనదిగా మారుతుంది. దీంతో బ్యాంకులు తమ కస్టమర్లకు రుణాలను కూడా ఖరీదైనవిగా చేస్తాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహం తగ్గుతుంది. ద్రవ్య ప్రవాహం తగ్గినప్పుడు, డిమాండ్ తగ్గడంతో పాటుగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది.
అదేవిధంగా.. ఆర్థిక వ్యవస్థ పతన దశలో ఉన్నప్పుడు.. కోలుకోవడానికి డబ్బు ప్రవాహాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితిలో కేంద్ర బ్యాంకు పాలసీ రేటును తగ్గిస్తుంది. దీని కారణంగా, బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుండి పొందే రుణం చౌకగా మారుతుంది. కస్టమర్లు కూడా తక్కువ రేటుకు రుణం పొందుతారు.


Click it and Unblock the Notifications