అందుకే మార్కెట్లు భారీ నష్టాల్లోకి, ఈ స్టాక్స్ నష్టపోయాయి, ఆ స్టాక్ అదుర్స్
ముంబై: గతవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రారంభ సెషన్‌లోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 525 పాయింట్లు, నిఫ్టీ 188 పాయింట్లు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పాటు ప్రాఫిట్ బుకింగ్ సూచీలను దెబ్బతీసింది. ఇటీవల భారీ లాభాలు నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 59,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ కీలకమైన 17,400 మార్కు దిగువకు వచ్చింది.

ఈ రంగాలు డౌన్
నేడు ఉదయం 58,647 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ అంతలోనే లాభాల్లోకి వచ్చినట్లు తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 524.96 పాయింట్లు నష్టపోయి 58,490.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు నష్టపోయి 17,396 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంతో రూపాయి మారకం వ్యాల్యూ 73.74గా ఉంది.
నిఫ్టీలో టాటా స్టీల్, JSW స్టీల్, హిండాల్కోఇండస్ట్రీస్, UPL, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. HUL, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, HCL టెక్నాలజీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు రాణించాయి. FMCG మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాలు చూశాయి. మెటల్ సూచీ దాదాపు 7 శాతం మేర పడిపోయింది.

ఈ స్టాక్స్ భారీ నష్టం...
బీఎస్ఈలో చంద్ర భగత్ ఫార్మా 16.67 శాతం, గ్రేటెక్స్ కార్పోరేట్ సర్వీసెస్ లిమిటెడ్ 16.18 శాతం, ఆర్ఎంసీ స్విచ్‌గేర్స్ 15.40 శాతం, యునిషైర్ అర్బన్ ఇన్ఫ్రా 15.17 శాతం, ఆష్కా హాస్పిటల్స్ 14.68 శాతం నష్టపోయాయి. నిఫ్టీలో 9 స్టాక్స్ లాభాల్లో, 41 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
బీఎస్ఈలో ఆష్కా హాస్పిటల్స్ లిమిటెడ్, ఎంఏసీ హాస్టల్స్, క్రిష్నా డయాగ్నస్టిక్స్ లిమిటెడ్, జియా ఎకో ప్రోడక్ట్స్ లిమిటెడ్, జోంజుల ఓవర్సీస్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. హెచ్ఎల్ఈ గ్లాస్‌కోట్, వసుంధర రాసాయనాస్, సీఈఎస్సీ వెంచర్స్, రాయల్ ఆర్చిడ్స్, నియోజెన్ కెమికల్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

ఈ స్టాక్ అదుర్స్
ఇక, సిగరేట్, ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీ స్టాక్ ధర నేడు భారీగా లాభపడింది. ఈ షేర్ నేడు 0.78 శాతం ఎగబాకి రూ.232.95 వద్ద క్లోజ్ అయింది. ఉదయం ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. సోమవారం ఇంట్రాడేలో ఐటీసీ షేర్ ధర 4 శాతం మేర లాభపడి రూ.239.35 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో రూ.230.25 నుండి రూ.239.40 మధ్య ట్రేడ్ అయింది. ఈ స్టాక్ అంతకుముందు ఫిబ్రవరి 9, 2021న రూ.239.15కి చేరుకుంది. ఈ స్టాక్ గత మూడు సెషన్‌లలోనే 12 శాతం లాభపడింది.


Click it and Unblock the Notifications