దీపావళికి డబుల్ బొనాంజా, PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్?
ఈపీఎఫ్‌వో దీపావళి కానుకను ప్రకటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తోన్న పెన్షన్‌ను రెట్టింపు చేయాలని కార్మిక శాఖ ప్రతిపాదన చేసింది. ఇందుకు ఆర్థిక శాఖ కూడా సుముఖంగా ఉందని తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన రావొచ్చునని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉన్న పెన్షన్ రూ.2వేలకు పెరగనుంది. దీంతో యాభై లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.

అలా అయితే ప్రకటన వెలువడవచ్చు
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు దీపావళి బహుమతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం ప్రయివేటురంగ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈఫీఎఫ్ ఖాతాలో ఉద్యోగుల వాటా నుండి 12 శాతం, కంపెనీ వాటాగా 12 శాతం జమ చేస్తాయి. కంపెనీకి చెందిన 12 శాతం వాటాలో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీం(EPS)కు వెళ్తుంది.
ఈ పండుగ సమయంలో పెన్షన్ బహుమతిని కేంద్రం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుకు ఆర్థిక శాఖ కూడా దీనికి సుముఖంగా ఉందట. అదే జరిగితే త్వరలో పెన్షన్ రెట్టింపుకు సంబంధించి ప్రకటన వెలువడవచ్చు.

లక్షలమందికి ప్రయోజనం
సమాచారం మేరకు కనీస పెన్షన్ స్కీం రూ.1000 నుండి రూ.2000కు పెరగవచ్చు. 2019లో దీనికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) ఆమోదం తెలిపింది. పెన్షన్‌ను రూ.2వేల నుండి రూ.3వేలకు పెంచాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. పెన్షన్ రెట్టింపు అయితే ప్రభుత్వం మరో రూ.2 నుండి రెండున్నర కోట్ల రూపాయల చెల్లించాల్సి వస్తుంది. దీని ద్వారా లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ
కాగా, ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ తెలిపింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని అందించనున్నట్లు లాక్ డౌన్ సమయంలో ఈపీఎఫ్ఓ ప్రకటించింది. అయితే ఈ వడ్డీ డబ్బును రెండు విడతలుగా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇందులో మార్పు చేసి ఒకేసారి మొత్తం వడ్డీ నగదును ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించనున్నారు.


Click it and Unblock the Notifications