Edible Oils: ప్రజలకు శుభవార్త.. తగ్గనున్న వంటనూనె ధరలు..! పూర్తి వివరాలు
Edible Oil Prices: తిండి గింజల నుంచి వంటనూనె వరకు అన్నింటి ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. మరో పక్క దేశంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో మోదీ సర్కార్ అర్థరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు పప్పు దినుసులు రేట్లను అదుపుచేసే పనిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా వంటనూనెల ధరలను తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో మోదీ సర్కార్ శుద్ధి చేసిన సోయా ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5%కి తగ్గించింది. తాజా తగ్గింపులు జూన్ 15, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. అయితే భారత్ ఎక్కువగా ముడి నూనెలను దిగుమతి చేసుకుని ఇక్కడి రిఫైనరీల్లో శుద్ధి చేస్తుంటారు. ఈ క్రమంలో క్రూడ్ సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్‌లపై దిగుమతి సుంకం దాదాపు 5.50 శాతంగా ఉంది.

ముడి, శుద్ధి చేసిన సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్ మధ్య తక్కువ సుంకం భేదం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన చెబుతున్నారు. వాణిజ్య పరంగా కూడా వీటి దిగుమతి కంపెనీలకు లాభదాయకం కాదంటున్నారు. అయితే మార్కెట్లపై కొంత తాత్కాలిక భావోద్వేగ ప్రభావం ఉండొచ్చని తెలిపారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆహార ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఎన్నికల సీజన్ కావటంతో ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రష్యా, ఇండోనేషియాలు ఎగుమతి సుంకాలను తగ్గించటంతో అనేక వంటనూనెల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే మరోపక్క దేశీయంగా నూనె గింజలు పండించే రైతులు, క్రషింగ్ మిల్లుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications