Free Ration: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్ లో పేదలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. వీరికి ఉపసమనం కలిగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ను పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో వారికి అందిస్తున్న ఉచిత రేషన్ డిసెంబర్ 2028 వరకు అందుబాటులో ఉంటుందని కేబినెట్ బ్రీఫింగ్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.11.8 లక్షల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. తాజా పొడిగింపు జనవరి 1, 2024 నుంచి వర్తిస్తుంది.

నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇదే విషయాన్ని ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ర్యాలీ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో తొలిసారిగా ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో కేంద్రం ప్రారంభించింది. ఈ ఉచిత రేషన్ పథకం కింద పేద కుటుంబాలకు ప్రతి నెలా 5 కిలోల ఆహార ధాన్యాలు అందించబడతాయి.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం వరకు రెండు కేటగిరీలు-అంత్యోదయ అన్న యోజన(AAY), ప్రాధాన్యతా గృహాలు కింద ఉన్నాయి. రెండు ఆహార సబ్సిడీ పథకాలను PMGKAYలో ఏకీకృతం చేయడం NFSA అమలును క్రమబద్ధీకరించడం, దేశ ఆహార భద్రతా నెట్‌వర్క్ ప్రభావాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2023 బడ్జెట్ ప్రకటన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ PMGKAY కింద ఏడాదికి రూ.2 లక్షల కోట్లు కేంద్రం భరిస్తుందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications