Bharat Atta: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ పేదలపై మమకారాన్ని ప్రదర్శించటం పెంచింది. ఈ క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ అనేక స్కీమ్స్ లాంచ్ చేస్తోంది.
మెుదట గ్యాస్ సబ్సిడీ పెంపు, తర్వాత ఉచిత రేషన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా దీపావళికి మరో ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 'భారత్ ఆటా' బ్రాండ్ పేరుతో కిలోకు రూ.27.50 సబ్సిడీ రేటుకే గోధుమ పిండిని విక్రయించాలని నిర్ణయించింది. ఇది సామాన్య ప్రజలకు పెరిగిన ధరల భారం నుంచి ఉపసమనం అందిస్తుందని మోదీ సర్కార్ చెబుతోంది. వీటిని NAFED, NCCF, కేంద్రీయ భండార్ సహకార సంస్థల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

భారత్ ఆటా ధర నాణ్యత, ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర రూ.36-70 కంటే తక్కువగా ఉంచబడింది. ఫిబ్రవరిలో ధరల స్థిరీకరణ నిధి పథకంలో భాగంగా కేంద్రీయ భాండార్లు, NAFED, NCCF ద్వారా ప్రభుత్వం 18,000 టన్నుల 'భారత్ ఆటా'ను కిలోగ్రాముకు రూ.29.50 చొప్పున ప్రయోగాత్మకంగా దేశంలో విక్రయించింది. తాజాగా కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 100 మెుబైల్ వ్యాన్లను ప్రారంభించారు. తమ ప్రయోగం సఫలమైనందున విజయవంతంగా దేశంలోని ప్రతిచోటా గోధుమ పిండిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.
దేశంలోని సామాన్యులు అందరికీ దీనిని చేరువ చేసే క్రమంలో ఏకంగా కిలో రూ.21.50 చొప్పున 2.5 లక్షల టన్నుల గోధుమలను కేంద్రం కేటాయించింది. ఈ గోధుమలను పిండిగా మార్చి మూడు ఏజెన్సీలు దేశంలో కేజీ రూ.27.50 చొప్పున విక్రయించనున్నాయి. ఇదే క్రమంలో భారత్ ఆటా కాకుండా.. ఈ మూడు ఏజెన్సీల మొబైల్ వ్యాన్లు, అవుట్‌లెట్‌లు ధరల పెరుగుదలను నియంత్రించడానికి సబ్సిడీ ధరకు చనా పప్పు, ఉల్లిపాయలను విక్రయిస్తాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications