Windfall Tax: క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. ఎలక్షన్స్ సమయంలోనే అలా..
Crude Oil News: ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ రేట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెల మెుదటి తారీఖున ఎన్నికల తరుణంలో తగ్గింపుల ప్రకటన కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఊరటను ఇచ్చే అంశంగా కొనసాగుతోంది.
దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం నేడు టన్నుకు రూ.9,600 నుంచి రూ.8,400కి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ(SED) రూపంలో దేశంలో విధించబడుతోంది. అంతకుముందు ఏప్రిల్ 16న, ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.6,800 నుంచి రూ.9,600కి పెంచిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 4న ప్రభుత్వం పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ.4,900 నుంచి రూ.6,800కి పెంచింది. అంతకుముందు మార్చి 15, 2024న దేశీయ ముడి చమురు అమ్మకాలపై విండ్‌ఫాల్ పన్నును ఆర్థిక మంత్రిత్వ శాఖ టన్నుకు రూ.4,900గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం ఎగుమతిపై జీరో పన్నును కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త రేట్లు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జూలై 1, 2022న భారత ప్రభుత్వం తొలిసారిగా విండ్‌ఫాల్ లాభాలపై పన్నును విధించటం మెుదలుపెట్టింది. దీంతో ఇంధన కంపెనీల అసాధారణ లాభాలపై పన్ను విధించే దేశాల జాబితాలో చేరింది. గత రెండు వారాల చమురు ధరల సగటు ఆధారంగా ప్రతి పదిహేను రోజులకు పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని తెలిసిందే.


Click it and Unblock the Notifications