GST On Health Insurance: ఇటీవల లోక్ సభ ఎన్నికల కోలాహలం దేశంలో ప్రారంభమైన నాటి నుంచి మోదీ ప్రభుత్వం అనేక కీలక ప్రకటనలు చేస్తోంది. రైతులు, సామాన్యులు, ఉద్యోగులు అంటూ అనేక కేటగిరీలకు చెందిన ప్రజలను టార్గెట్ చేసుకుంటూ ఎన్నికల వేళ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇప్పటికే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉన్నా లేకపోతే రానున్న రోజుల్లో కొనుగోలు చేయాలనుకుంటున్నా ఈ వార్త మీకోసమే. తాజాగా మోదీ ప్రభుత్వం ఆరోగ్య బీమా పాలసీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. రూ.30,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.30 వేల వరకు ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నట్లయితే కుటుంబంలోని నలుగురికి రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. పన్ను రేటు తగ్గింపు వల్ల దేశంలో ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వాస్తవానికి జీఎస్టీ పన్ను రేటు తగ్గింపు నిర్ణయం పాలసీ ప్రీమియం రేట్లను తగ్గించడంలో లేదా హెల్త్ కవర్ ఎంపికలో అదనపు ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుందని ఒక అధికారి వెల్లడించారు. ఇది ప్రజల అవసరాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. దీనిపై నిర్ణయం పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనని, 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అధికారి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై వసూలు చేస్తున్న జీఎస్టీ రేటును 18 శాతం నుంచి తగ్గించటాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.
దేశంలో జీఎస్టీ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టక ముందు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై సర్వీస్ టాక్స్ 15 శాతంగా ఉండేది. అయితే మోదీ సర్కార్ జీఎస్టీ పన్ను విధానాన్ని కొత్తగా దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే వ్యక్తి నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించింది. జీఎస్టీకి ముందు కాలంలో ఉన్న 15 శాతం సేవా పన్ను కంటే ఈ రేటు 3 శాతం అధికం. ఆదాయపు పన్ను సెక్షన్ 80డి కింద టాక్స్ పేయర్స్ తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. లేదా ఇది ఎన్నికల స్టంట్ గా మిగిలిపోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications