7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు కొత్త స్కీమ్.. ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి, పూర్తి వివరాలు..
Unified Pension Scheme: కొత్త ఏడాది ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కీలక ప్రకటన చేశారు. ఆయన 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉద్యోగుల్లో గడచిన కొన్ని రోజులుగా వేతన పెంపులపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఉద్యోగులకు కొత్త స్కీమ్ కూడా ప్రారంభిస్తోంది.
వివరాల్లోకి వెళితే కేంద్ర ఉద్యోగులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి 7వ వేతన సంఘం కింద కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ(NPS)కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్(UPS) ప్రారంభించింది. ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఉద్యోగులకు UPS అందుబాటులో ఉంటుంది. NPS కింద అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు NPS నిర్మాణంలోని ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకానికి మారే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

యూనిఫైడ్ పెన్షన్ విధానం కింద పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పదవీ విరమణకు ముందు గత 12 నెలల్లో సగటు ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్‌గా పొందుతారు. అయితే ఇందుకు అర్హత పొందటానికి వారు 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ 14% నుంచి 18.5%కి పెంచుతోంది. ఇక్కడ ఉద్యోగుల పెన్షన్ కాంట్రిబ్యూషన్ మాత్రం పెరగదని గుర్తుంచుకోవాలి. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణించినప్పుడు ఉద్యోగి పొందే పెన్షన్‌లో 60% అతని/ఆమె కుటుంబానికి లభిస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ చేసిన తర్వాత నెలకు రూ.10,000 పెన్షన్‌గా పొందుతారు.
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు ఒక్కసారి ఎంపిక చేసుకుంటే దానిని మార్చుకోవటం కుదరదు. అలాగే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద దాదాపు 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులను ఏకీకృత పెన్షన్ విధానం కిందకు తీసుకొచ్చాయి. కానీ అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ విధానానికే మెుగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications