Onion Production: దేశంలో ఈ ఏడాది ఉల్లి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా ఎన్నికలు దగ్గర పడతున్న వేళ ప్రజాగ్రహానికి గురికాకుండా ఉండేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది బీజేపీ సర్కార్.
వాస్తవానికి ఈ ఏడాది ప్రభుత్వం తన బఫర్ స్టాక్ కోసం 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. దేశంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు వాటిని అదుపుచేసేందుకు ఈ నిల్వలను ఉపయోగిస్తారు. ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) వంటి ఏజెన్సీలు ప్రభుత్వం తరపున ఉల్లిపాయలను సేకరిస్తాయని వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీటి వద్ద దాదాపు లక్ష టన్నుల ఉల్లి అందుబాటులో ఉంది.

బఫర్ స్టాక్ నుంచి రాయితీ ధరలకు ఉల్లిపాయలను విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ధరల నియంత్రణకు సహాయపడింది.ఈ నెలాఖరులో ఉల్లి ఎగుమతిపై నిషేధం ఎత్తివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నిషేధం మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. 2023-24లో ఉల్లి ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాల మధ్య బఫర్ స్టాక్‌ను రూపొందించాలనే ప్రభుత్వ ప్రణాళిక వచ్చింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఉల్లి ఉత్పత్తి సుమారు 254.73 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. గత ఏడాది ఇది దాదాపు 302.08 లక్షల టన్నులుగా ఉంది. అలాగే 2021-22 సంవత్సరం ఉల్లి ఉత్పత్తి 316.87 లక్షల టన్నులు.
దేశంలోని ఉల్లి పంట పండించే రాష్టాల్లోని డేటా ప్రకారం.. మహారాష్ట్రలో 34.31 లక్షల టన్నులు, కర్ణాటకలో 9.95 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 3.54 లక్షల టన్నులు, రాజస్థాన్‌లో 3.12 లక్షల టన్నుల దిగుబడి తగ్గడం వల్ల మొత్తం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
అలాగే ప్రభుత్వ ముందస్తు అంచనాల ప్రకారం 2023-24లో బంగాళాదుంప ఉత్పత్తి దాదాపు 58.9 మిలియన్ టన్నులు కావచ్చు. పశ్చిమ బెంగాల్‌లో ఉత్పత్తి క్షీణత కారణంగా గత సంవత్సరం 60.1 మిలియన్ టన్నులతో పోలిస్తే 3% ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని అంచనా వేయబడింది. టమోటా మొత్తం ఉత్పత్తి 20.8 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. ఇది గత సంవత్సరం 20.4 మిలియన్ టన్నులుగా నిలిచింది.


Click it and Unblock the Notifications