Budget 2024: శుభవార్త.. బడ్జెట్లో 10 కోట్ల రైతులకు మేలుచేసే కీలక నిర్ణయం..!
PM Kisan Yojana: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు రైతుల కోసం ఇందులో కీలక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులకు బడ్జెట్ తాయిలాన్ని ప్రకటించనుందని సమాచారం. వాస్తవానికి పీఎం కిసాన్ యోజన కింద అందిస్తున్న సహాయాన్ని రూ.6000 నుంచి రూ.8000లకు పెంచే ఆలోయనలో బీజేపీ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేటాయింపులను పెంచే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) వాయిదాల పెంపుపై తుది నిర్ణయం త్వరలో తీసుకోబడుతుందని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి-మార్చి 2024 మధ్య పీఎం-కిసాన్ యోజన 16వ విడతను ప్రభుత్వం విడుదల చేయవచ్చు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ దీనికి ముందు 15వ విడత డబ్బు నవంబర్ 15, 2023న జమ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని మూడు విడతలుగా రూ.2000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. టాక్స్ ఫైలింగ్ చేసే వ్యక్తులు మాత్రం దీనిని పొందేందుకు అర్హులు కారు.
ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటనలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఇటీవల దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రధానంగా ఓటు ఆన్ అకౌంట్‌గా పనిచేస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకుముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను మధ్యంతర బడ్జెట్ అనిపిలుస్తాము. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను తర్వాత ప్రవేశపెడుతుంది. గతాన్ని పరిశీలిస్తే.. 2019లో ఎన్నికలకు ముందర కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా రైతులకు అందిస్తున్న సాయం విషయంలో ఎలాంటి పెంపు లేనందున ప్రస్తుతం రైతన్నలు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications