PM Awas Yojana: రోజురోజుకూ జీవితం ఖరీదైనదిగా మారిపోతోంది. ఉన్నవారికి లేని వారికి మధ్య అంతరాయం పెరిగిపోతోంది. దీనిపై ప్రధాని మోదీ ముఖ్యంగా దృష్టి సారించారు. అందుకే మధ్యతరగతి ప్రజల కోసం నేనున్నానంటూ కీలక ప్రకటన చేశారు.
మధ్యతరగతి ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. నగరాల్లో నివశించే సామాన్యులకు ఉండే సొంతింటి కలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం 2015 సంవత్సరంలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త పథకం కింద నగరాల్లో సొంతంగా ప్రైవేట్ ఇళ్లు లేని కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధాని వాగ్ధానం చేశారు.

ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(అర్బన్) కింద కూడా కోటికి పైగా ఇళ్లను ప్రభుత్వం ఆమోదించింది. జూలై 31, 2023 వరకు ఈ పథకం కింద సుమారు 1.18 కోట్ల గృహాలు ఆమోదించబడ్డాయి. అదే సమయంలో 76 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. చాలా మందికి ఉండే సొంతింటి కలను బీజేపీ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ నమ్మకం కలిగించారు. తమ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని తన ప్రసంగం ద్వారా మోదీ హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో మోదీ మధ్యతరగతిని పీడిస్తున్న మరో సమస్య ద్రవ్యోల్బణంపై కూడా ప్రసంగంలో ప్రస్థావించారు. తమ ప్రభుత్వం దేశప్రజలకు ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించడానికి కృషి చేస్తోందని.. ఈ ప్రయాణంలో కొంత విజయం సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్ ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణ కట్టడికి తన ప్రయత్నాలు మాత్రం నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.


Click it and Unblock the Notifications