జూన్ 17న జీ7 వేదికగా మోదీ-ట్రంప్ భేటీ.. ఇరాన్ యుధ్దం మధ్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ..
ఫ్రాన్స్‌లోని ఎవియాన్ (Evian) నగరంలో జరగబోయే జీ7 (G7) సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 17న సాయంత్రం 6:15 గంటలకు (IST) ఒక కీలక ముఖాముఖి సమావేశం ఖరారైంది. ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య జరగబోయే చర్చల్లో భారత్-అమెరికా దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ప్రధాన అజెండాగా ఉండబోతోందని వైట్ హౌస్ ఉన్నతాధికారులు అధికారికంగా ధృవీకరించారు.
గత కొన్ని నెలలుగా ఈ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల దౌత్య వర్గాల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు సాగుతుండగా, ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి ఒక కొలిక్కి తీసుకురావాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ ఫిబ్రవరి 2025లో జరిపిన అమెరికా పర్యటన తర్వాత, అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన ముఖాముఖిగా భేటీ కావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సమావేశంపై అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పంపిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్ 16, 17 తేదీలలో ఫ్రాన్స్‌లో నిర్వహించనున్న ఈ జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. తన 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా శనివారం (జూన్ 13) భారత్ నుండి బయలుదేరిన ప్రధాని మోదీ, ఈ పర్యటనలో ఫ్రాన్స్‌తో పాటు స్లోవేకియా దేశాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ జీ7 సదస్సులో ఆయన కేవలం అమెరికా అధ్యక్షుడితోనే కాకుండా, జీ7 దేశాల అధినేతలతో, భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో , వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రముఖులతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సుస్థిర ఆర్థిక అభివృద్ధిని సాధించడం, సప్లై చైన్ పునరుద్ధరణ , ప్రస్తుత సాంకేతిక యుగంలో అత్యంత కీలకమైన కృత్రిమ మేధస్సు (AI) సురక్షిత వినియోగం వంటి గ్లోబల్ అంశాలపై ఈ సదస్సులో భారత్ తన గళాన్ని వినిపించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జీ7 సదస్సులో భారత్ కేవలం తన గురించే కాకుండా, గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) ఆకాంక్షలను ప్రపంచ వేదికపై బలంగా వినిపిస్తుందని స్పష్టం చేశారు.
అయితే, తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. మధ్యప్రాచ్యంలో (పశ్చిమ ఆసియా) ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు అమెరికా ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) లో ఇరు దేశాల ఘర్షణల వల్ల నిలిచిపోయిన మైన్లను (Demining) తొలగించే ప్రక్రియపై బ్రిటన్, ఫ్రాన్స్ వంటి జీ7 మిత్రదేశాలతో పాటు ప్రధాని మోదీతో కూడా ట్రంప్ చర్చించే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
దీనితో పాటు, ఇటీవల ఒమన్ తీరంలో భారతీయ నావికులు ఉన్న చమురు ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులు, రష్యాతో భారత్ కొనసాగిస్తున్న చమురు వాణిజ్యం , అమెరికా విధిస్తున్న భారీ సుంకాలు ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జరగబోయే మోదీ-ట్రంప్ భేటీ.. అటు ద్వైపాక్షిక వాణిజ్యానికి, ఇటు ప్రపంచ ఇంధన భద్రత , శాంతి పునరుద్ధరణకు అత్యంత కీలకమైనదిగా మారబోతోంది.


Click it and Unblock the Notifications
