Mobile Recharge Hike: చాలా కాలంగా దేశంలోని టెలికాం రంగంలో మనుగడ పోరాటం కొనసాగుతోంది. భారీగా టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసేందుకు డబ్బులు ఉన్న కంపెనీలు మాత్రమే తక్కువ లాభాలతో మనుగడను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం ప్రధాన ఆటగాళ్లైన ఎయిర్ టెల్, జియో, వొడఫోన్ ఐడియా మాత్రమే మిగలగా మరో పక్క బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరుచుకుంటూ వేగంగా వీరి సరసన చేరేందుకు ప్రయత్నిస్తోంది.
పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయాలను పెంచుకోవాలని టెలికాం ఆపరేటర్లు చాలా కాలంగా వేచిచూస్తున్నారు. దీంతో ఈ రంగంలోని కంపెనీలు దేశంలో లోక్ సభ ఎన్నికల తర్వాత ఛార్జీల మోత మోగించాలని చూస్తున్నాయి. కంపెనీలు తమ 5జీ రోలవుట్ పై దృష్టి సారిస్తుండగా పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకునేందుకు చూస్తున్నాయి. టెక్నాలజీపై భారీగా పెరిగిన పెట్టుబడితో మొబైల్ కనెక్షన్‌పై సగటు ఆదాయం క్షీణించినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో చేసేది లేక కంపెనీలు మొబైల్ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నాయి.

అందుకే దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు మెుబైల్ వినియోగ ఛార్జీలను లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పెంచొచ్చని తెలుస్తోంది. అయితే ఛార్జీల పెంపు ప్రస్తుత ధరల కంటే 25 శాతం వరకు ఉంటుందని సమాచారం. ఇలా జరిగితే కంపెనీల సగటు ఆదాయం 16 శాతం పెరుగుతుందని అంచనా. దీంతో తద్వారా 5జీ పెట్టుబడి ఖర్చును టెలికాం కంపెనీలే భరించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్చి త్రైమాసికంలో ప్రతి కనెక్షన్‌కి రిలయన్స్ జియో సగటు ఆదాయం రూ.181.7గా నివేదించబడింది. ఇది అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌కు రూ.208, వోడాఫోన్‌కు రూ.145గా ఉంది. కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా లోక్ సభ ఎన్నికల తర్వాత రేట్ల పెంపుపై ఊహాగానాలు దేశంలో వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది తెలివైన యూజర్లు తమ రీఛార్జ్ ప్లాన్స్ గడువు పూర్తికాకముందరే ఇయర్లీ ప్యాక్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications