LIC News: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీకి బలమైన వ్యాపారం ఉంది. దీనికి ప్రధాన కారణం నిబద్ధతతో పనిచేస్తున్న ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులను చెప్పుకోవాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం వీరికోసం కీలక నిర్ణయాలను తీసుకుంది.
అందుకే పండుగ రోజు తీపికబురు ప్రకటించింది. ఈ క్రమంలో ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలను ప్రకటించింది. వారికి చెల్లించే గ్రాట్యుటీ పరిమితిని పెంచటంతో పాటు తిరిగి నియమించబడిన ఏజెంట్లకు పునరుద్ధరణ కమీషన్, టర్మ్ ఇన్సూరెన్స్ కవర్, కుటుంబ పెన్షన్ అందించాలని నిర్ణయించింది. దీనికి కింద 13 లక్షల మంది ఏజెంట్లు, లక్ష మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి ద్వారా దేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని మరింతగా పెంచాలని ఎల్ఐసీ చూస్తోంది.

ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు కేంద్రం పెంచింది. తాజా చర్యలతో తిరిగి నియమించబడిన ఏజెంట్లు పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు. దీనివల్ల ఏజెంట్లకు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రస్తుత రూ.3,000-10,000 నుంచి రూ.25,000-1,50,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చివరగా ఎల్‌ఐసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏకరీతిగా 30 శాతం కుటుంబ పెన్షన్‌ను అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ.9,544 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం కేవలం రూ.683 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,68,881 కోట్ల నుంచి రూ.1,88,749 కోట్లకు పెరిగిందని ఎల్‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రభుత్వం సంక్షేమ నిర్ణయాలను ప్రకటించిన తర్వాత 3.25 గంటల సమయంలో ఎల్ఐసీ స్టాక్ ఎన్ఎస్ఈలో గమనిస్తే 0.68 శాతం స్వల్ప నష్టంతో రూ.662.95 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications