Vedanta: మైనింగ్ వ్యాపారంలో అనిల్ అగర్వాల్ ఒక కింగ్. దశాబ్దాలుగా మైనింగ్ రంగంలో వేదాంత పేరుతో ఆయన తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల అదానీ గ్రూప్ అధిక రుణభారం కలిగి ఉందంటూ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాత చాలా కంపెనీలు తమ రుణ భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే అనిల్ అగర్వాల్ సంస్థ వేదాంత సైతం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో కంపెనీ తన భారీ రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు వేదాంత లిమిడెట్ లోని మైనారిటీ వాటాలను విక్రయించి నిధులను సేకరించాలని చూస్తోందంటూ వార్తలు వచ్చాయి. వీటి ద్వారా అసలు కంపెనీ రుణాలను చెల్లించలేని స్థితిలో ఉందా.. లేక నిధుల లభ్యత అంత తక్కువగా ఉందా అనే అనుమానాలు మార్కెట్లలో చెలరేగాయి. అయితే కంపెనీలో దాదాపు 5 శాతం వాటాలను ఇందుకోసం విక్రయించాలని చూస్తున్నట్లు పుకార్లు వెల్లువెత్తాయి.

ఈ వార్తలు మార్కెట్లో పెను ప్రకంపనలనే సృష్టించాయి. దీంతో స్టాక్ కొంత ఒత్తిడికి గురైంది. కాగా వేదాంత కంపెనీలో మెజారిటీ వాటా అంటే 70 శాతాన్ని అగర్వాల్ కు చెందిన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్నాయి. అయితే గత నెలలో తన జింక్ వ్యాపారంలోని వాటాలను విక్రయించాలని మైనింగ్ కింగ్ ప్రయత్నించినప్పటికీ కీలక వాటాదారునిగా ఉన్న భారత ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. దీంతో నిధుల సమీకరణకు కంపెనీ ఇతర మార్గాలపై దృష్టి సారించింది.
లండన్ కేంద్రంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న కంపెనీ ప్రస్తుతం దాదాపు 13 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పులను కలిగి ఉంది. ప్రస్తుతం వాటాల విక్రయం జరుగుతుందంటూ వచ్చిన వార్తలపై అనిల్ అగర్వాల్ స్పందించారు. వాటాల అమ్మకంపై వస్తున్న వార్తలు నిరాధారమైనవని అలాంటి ఆలోచన లేదని అనిల్ అగర్వాల్ స్పష్టం చేశారు. మెుత్తానికి ఈ వార్త సృష్టించిన ఆందోళనల కారణంగా ఎన్ఎస్ఈలో వేదాంత లిమిటెడ్ స్టాక్ ఈరోజు దాదాపు 5 శాతం మేర నష్టపోయి రూ.271.25 వద్ద ట్రేడింగ్ ముగించింది.


Click it and Unblock the Notifications