EPS-95 కనీస పెన్షన్ రూ. 7,500 కి పెరిగిందా? వైరల్ అవుతున్న లెటర్‌పై EPFO క్లారిటీ!
దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేట్ , సంఘటిత రంగ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాప్తి చెందుతోంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS-95) కింద వచ్చే కనీస పెన్షన్ (Pension) మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 7,500 కి పెంచిందనేది ఆ వార్త సారాంశం.
అంతేకాకుండా, ఈ పెరిగిన నిబంధనలు ఏప్రిల్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చాయని.. మే 1, 2026 నుండి పెన్షనర్ల అకౌంట్లలో ఈ కొత్త రేట్ల ప్రకారం డబ్బులు జమ కాబోతున్నాయంటూ ఒక అధికారిక నోటిఫికేషన్ లాంటి లెటర్ విపరీతంగా షేర్ అవుతోంది. అయితే, ఈ వ్యవహారంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) స్పందిస్తూ.. పెన్షనర్లకు షాకింగ్ నిజం చెప్పింది.

వైరల్ అవుతున్న ఆ ఫేక్ లెటర్‌లో ఏముంది?
ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్ - X) వేదికగా ఈపీఎఫ్ఓ స్పందిస్తూ.. "ఈపీఎస్ పెన్షన్ పెంపుపై సర్క్యులేట్ అవుతున్న సదరు లెటర్ ముమ్మాటికీ నకిలీది (Fake)" అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ ఫేక్ లెటర్‌లో ఇలా రాసి ఉంది..
"కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈపీఎస్-95 స్కీమ్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై ప్రతి నెల రూ. 7,500 కనీస పెన్షన్ అందుతుంది. ఈ మార్పు ఏప్రిల్ 30, 2026 నుండి అమలువుతుంది. దీనికి సంబంధించి అన్ని విభాగాలు, బ్యాంకులు తక్షణమే చర్యలు తీసుకోవాలి."
ఈ అఫీషియల్ లుకింగ్ లెటర్‌ను చూసి చాలా మంది నిజమైన ప్రభుత్వ ఉత్తర్వులే అనుకుని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని, అదంతా కొందరు సృష్టించిన ఫేక్ నోటిఫికేషన్ అని EPFO తేల్చి చెప్పింది.
ప్రస్తుతం వస్తున్న అసలు కనీస పెన్షన్ (Pension) ఎంత?
ప్రభుత్వ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. EPS-95 స్కీమ్ పరిధిలోకి వచ్చే సబ్‌స్క్రైబర్లకు నెలకు కనీసం రూ. 1,000 పెన్షన్‌గా అందుతుంది.
- 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో చేరే సమయంలో.. ఎవరి బేసిక్ శాలరీ అయితే రూ. 15,000 లోపు ఉంటుందో, వారికి ఈ ఈపీఎస్ స్కీమ్ తప్పనిసరి అవుతుంది.
- ప్రతి నెల ఉద్యోగి బేసిక్ జీతం , డియర్నెస్ అలవెన్స్ (DA) నుండి 8.33% లేదా గరిష్టంగా రూ. 1,250 ఈ పెన్షన్ ఫండ్‌కు జమ అవుతుంది.
ఈపీఎస్ పెన్షన్ లెక్క ఎలా వేస్తారంటే?
ఈపీఎస్-95 నిబంధనల ప్రకారం నెలవారీ పెన్షన్ మొత్తాన్ని ఒక ప్రత్యేక ఫార్ములా ద్వారా లెక్కిస్తారు:
EPS pension= pensionable service x Pensionable Salary / 70
ఈ ఫార్ములా ప్రకారం లెక్కించినా సరే.. ఒక సభ్యుడికి లేదా అతని వితంతువు/నామినీ/ఆధారపడిన తల్లిదండ్రులకు కనీసం రూ. 1,000 అందేలా చట్టం రక్షణ కల్పిస్తుంది. అలాగే పిల్లలకు కనీసం రూ. 250, అనాథలైన పిల్లలకు (Orphan pension) నెలకు రూ. 750 కనీస పెన్షన్‌గా అందుతుంది.
తప్పుడు వార్తలను నమ్మకండి
కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ. 7,500 కి పెంచిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా పెన్షన్ పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మాట నిజమే అయినప్పటికీ.. ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వృద్ధులను, రిటైర్డ్ ఉద్యోగులను గందరగోళానికి గురిచేసే ఇటువంటి ఫేక్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని ఈపీఎఫ్ఓ సూచించింది.


Click it and Unblock the Notifications