ఇరాన్‌పై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. సహకరించిన అమెరికా.. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆందోళన..
మిడిల్ ఈస్ట్ టెన్సన్స్ మళ్లీ ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్‌తో అణు ఆయుధాల ఒప్పందంపై అమెరికా సాగిస్తున్న చర్చలు ఎలాంటి స్పష్టమైన పరిష్కారానికి దారితీయకపోవడంతో.. మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు ఒక్కసారిగా తీవ్రమయ్యాయి. తాజాగా Israel అమెరికా మద్దతుతో Iranపై ముందస్తు సైనిక దాడులు ప్రారంభించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆకస్మిక దాడులు ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయాల వైపు నడిపిస్తున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలు, ముఖ్యంగా United States, చాలా కాలంగా చర్చలు జరుపుతున్నప్పటికీ, పరస్పర విశ్వాస లోపం వల్ల అవి ఫలితం లేకుండా సాగుతున్నాయి. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి దశకు చేరుతోందన్న అనుమానంతో.. ఇజ్రాయెల్ ఈసారి వేచి చూడకుండా ముందస్తు చర్యలకు దిగినట్టు సమాచారం. అమెరికా సైనిక సహకారంతో శనివారం ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ దాడులు ఇరాన్ రాజకీయ, భద్రతా వ్యవస్థల గుండె ప్రాంతాలకు సమీపంలో జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ Ayatollah Ali Khamenei కార్యాలయాలకు దగ్గరగా పేలుళ్లు జరిగినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ టెహ్రాన్‌లో లేరని, ఆయనను అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఒక ఉన్నతాధికారి Reutersకు తెలిపారు.
ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ నెలల తరబడి ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దాడి తేదీని కూడా వారాల ముందుగానే ఖరారు చేశారని ఒక ఇజ్రాయెల్ భద్రతా అధికారి పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాకుండా, ఇరాన్ నుంచి తక్షణ ప్రమాదం ఉందన్న అంచనాతో తీసుకున్న వ్యూహాత్మక చర్యగా వారు వివరిస్తున్నారు. దాడుల ప్రభావం వెంటనే పౌర జీవితంపై పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ తమ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. ఇరాన్‌లో టెహ్రాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ నిలిపివేయబడింది. దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ సేవలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఇది భద్రతా చర్యలలో భాగంగా తీసుకున్న నిర్ణయంగా అధికారులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌లో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. రవాణా మంత్రి ఆదేశాల మేరకు ప్రయాణీకుల విమానాలకు గగనతలం మూసివేయబడిందని ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ప్రజలు విమానాశ్రయాలకు రావద్దని సూచనలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా సైరన్లు మోగడం ప్రారంభమయ్యాయి. "ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు హెచ్చరికగా" ఈ సైరన్లు మోగించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అంతటా పాఠశాలలు మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వీలైనంతవరకు ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. పౌర రక్షణ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అమలు చేశారు. మరోవైపు, ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏదేమైనా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఈ తాజా సైనిక ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా, మొత్తం మధ్యప్రాచ్య భద్రతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అణు చర్చలపై ఉన్న ఆశలు ఈ దాడులతో దెబ్బతినగా, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రతరమవుతుందా లేదా దౌత్య మార్గాలు తిరిగి తెరుచుకుంటాయా అన్నది ప్రపంచం మొత్తం ఆతృతగా గమనిస్తోంది.


Click it and Unblock the Notifications