సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్లతో విరుచుకుపడ్డ హౌతీలు.. ఇరాన్ మీద దాడులపై ట్రంప్ సంచలన ప్రకటన..
Middle East Tensions Escalate: పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల నడుమ, సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై మరోసారి దాడి కలకలం రేపింది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ తిరుగుబాటు గ్రూపు హౌతీలు (Houthis) సౌదీ అరేబియా పశ్చిమ తీరంలోని రాబిగ్ (Rabigh) చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. రిఫైనరీ మౌలిక సదుపాయాలపై తాము నేరుగా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించినప్పటికీ.. ఈ ఘటనలో జరిగిన ఆస్తి లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
జెడ్డాకు ఉత్తరాన సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఎర్ర సముద్ర తీరంలో ఉన్న రాబిగ్ నగరంలో సౌదీ అరామ్కో, జపాన్‌కు చెందిన సుమిటోమో కెమికల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారీ 'పెట్రో రాబిగ్' చమురు శుద్ధి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది. ఈ దాడిపై స్పందించేందుకు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెంటనే అందుబాటులోకి రాలేదు. అంతకుముందు ఆదివారం సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీలు ప్రయోగించిన ఒక డ్రోన్‌ను తాము గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెల్లడించాయి.

గల్ఫ్ ప్రాంతమంతటా దాడుల పరంపర కొనసాగుతుండటం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బహ్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం.. శనివారం పౌరులకు చెందిన ఒక పారిశ్రామిక ప్రాంతంపై జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మరోవైపు సముద్ర రవాణా మార్గాలపై కూడా దాడులు ముమ్మరమయ్యాయి. ఒమన్ గల్ఫ్‌లో ఆదివారం ఒక ట్యాంకర్, సైనిక దళాలకు మధ్య సంఘటన చోటుచేసుకున్నట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) నివేదించింది. అంతకుముందు రోజు కూడా రెండు చమురు ట్యాంకర్లపై గుర్తు తెలియని వస్తువులతో దాడి జరగడంతో.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సముద్రంలో ప్రయాణించే నౌకలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని UKMTO హెచ్చరికలు జారీ చేసింది.
ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు రవాణాకు జీవనాడి అయిన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యుద్ధానికి ముందు ప్రపంచంలోని మొత్తం ముడి చమురులో దాదాపు ఐదవ వంతు (20 శాతం) ఈ జలసంధి గుండానే రవాణా అయ్యేది. ప్రస్తుత సైనిక ఘర్షణలు ఈ కీలక సముద్ర మార్గాన్ని దెబ్బతీయడంతో.. అంతర్జాతీయ ముడి చమురు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఇరాన్‌కు నూతన సంవత్సర గడువు విధించిన ట్రంప్, సైనిక దాడుల హెచ్చరిక..
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న పరోక్ష చర్చలు కొత్త సంవత్సరం (జనవరి 1, 2027) నాటికి ఒక కొలిక్కి రాకపోతే, ఇరాన్‌పై తిరిగి భారీ స్థాయిలో సైనిక దాడులకు ఆదేశించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, టెహ్రాన్‌తో జరుగుతున్న దౌత్యపరమైన సంప్రదింపులు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా, దాని మిత్రదేశాలపై శత్రుపూరిత దాడులను కొనసాగిస్తూనే, ఇరాన్ సంధానకర్తలు చర్చలను కేవలం కాలయాపన కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇరాన్ అధికారులను "వృత్తిపరమైన ట్యాప్ డాన్సర్లు"గా అభివర్ణించిన ట్రంప్.. వారు మధ్యంతర ఎన్నికలకు ముందు కంటే ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు; ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ వారు చేసేదల్లా శుద్ధ అబద్ధం అని మండిపడ్డారు.
మరోవైపు హార్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని (Naval Blockade) ఛేదించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. దేశంలోని అత్యంత కీలకమైన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపం (Kharg Island) నుండి ఈ దిగ్బంధనాన్ని దాటేందుకు ఇరాన్ ట్యాంకర్ల కాన్వాయ్‌ను సిద్ధం చేస్తోందన్న నివేదికల నేపథ్యంలో, ఫాక్స్ న్యూస్ కరస్పాండెంట్ ట్రే యింగ్‌స్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు.
వారు దిగ్బంధనాన్ని సవాలు చేస్తే బాగుంటుంది; గతంలో ధ్వంసమైన మిగతా ఇరాన్ నావికాదళంలాగే వారందరూ సముద్ర గర్భంలో కలిసిపోతారు" అని హెచ్చరించారు. కాగా, ఈ ప్రాంతంలో అమెరికా ఇప్పటికే తన సైనిక మోహరింపును భారీగా పెంచింది-అరేబియా సముద్రంలో రెండు అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, ఇజ్రాయెల్‌లో యూఎస్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలను సిద్ధంగా ఉంచారు.
సైనిక చర్యకు దిగుతామని హెచ్చరిస్తూనే.. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాకున్న ఆందోళనలను శాశ్వతంగా పరిష్కరించే ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పునరుద్ఘాటించారు. "మేము నిజమైన, శాశ్వత ఒప్పందాన్ని కోరుకుంటున్నాము, నకిలీ ఒప్పందాన్ని కాదు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆంక్షల ఎత్తివేత, విదేశాల్లోని ఆస్తుల విడుదల, నావికా దిగ్బంధన తొలగింపు సహా ఏడు షరతులను ఇరాన్ ముందుకు తెస్తుండటం వాషింగ్టన్‌కు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
గత వారం రోజులుగా ఇరాన్ తన పొరుగు గల్ఫ్ దేశాలపై దాడులను ముమ్మరం చేస్తూ కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరంతో పాటు, బహ్రెయిన్‌లోని అల్-రిఫా, అవాలి సైనిక స్థావరాల్లో ఉన్న యూఎస్ పేట్రియాట్ రాడార్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించడం ఉద్రిక్తతలను పరాకాష్ఠకు చేర్చింది.


Click it and Unblock the Notifications
