ముఖేష్ అంబానీ దూకుడు, మూడు అతిపెద్ద మిడిల్ ఈస్ట్ కంపెనీలతో చర్చలు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లోని సావరీన్ వెల్త్ ఫండ్స్‌లలో మూడు పెట్టుబడి కోసం రిలయన్స్‌తో చర్చలు జరుపుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రిలయన్స్ సంస్థను రుణరహిత సంస్థగా చేసే ప్రయత్నాల్లో ముఖేష్ పెట్టుబడులు సమీకరిస్తున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ వాటాలు విక్రయిస్తున్నారు.

ముబదాల పెట్టుబడిపై త్వరలోప్రకటన
అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో చర్చలు జరుగుతున్నట్లగా గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ చర్చలు దాదాపు చివరి దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో (జియో) 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తితో ఉంది. ముబదాలా పెట్టుబడిపై ఈ వారంలో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ రెండు సంస్థలు కూడా..
అబుదాబికి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో కూడా రిలయన్స్ పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వివిధ కంపెనీలతో చర్చలు ఆలస్యం కావొచ్చు లేదా మధ్యలోనే ఆగిపోవచ్చునని కూడా చెబుతున్నారు. కానీ ప్రపంచ దిగ్గజ సంస్థలు రిలయన్స్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఫేస్‌బుక్, కేకేఆర్ వంటి సంస్థలు పెట్టుబడి కారణంగా ఇప్పటికే 10 బిలియన్ డాలర్లు సమీకరించింది రిలయన్స్.

గత పెట్టుబడులు.. వివిధ సంస్థలతో చర్చలు
జియో-ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్‌బుక్ 9.99% వాటాను దక్కించుకుంది ఫేస్‌బుక్. అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1% వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత విస్టా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3% వాటాను, జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ రూ.6,598.38 కోట్ల పెట్టుబడితో 1.34% వాటాను కొనుగోలు చేశాయి. కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.78,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా వివిధ సంస్థలు చర్చలు జరుపుతున్నాయి.


Click it and Unblock the Notifications