ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల దృష్ట్యా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భారతీయ కంపెనీల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఆదాయం తగ్గినా కొన్ని సంస్థలు తమ వాటాదారులను సంతోష పెట్టేందుకు భారీ స్థాయిలో డివిడెండ్లు ప్రకటిస్తున్నాయి.
తాన్లా ప్లాట్ ఫారమ్స్ 9 వేల కోట్లు మార్కెట్ విలువ కలిగిన మిడ్ క్యాప్ IT కంపెనీ. ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లలో ఇది ఒకటి. దాని Q4 ఆదాయాలు బలహీనంగా ఉన్నప్పటికీ, తన వాటాదారులకు 400 శాతం డివిడెండ్ ప్రకటించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తుది డివిడెండ్ రూ.4 (400%) చొప్పున ఇచ్చేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించినట్లు తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది.

FY23Q4లో కార్యకలాపాల ద్వారా తాన్లా 833 కోట్లు ఆదాయం సంపాదించింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన 853 కోట్లతో పోలిస్తే 2.29 శాతం రాబడి క్షీణించింది. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్థూల లాభం 228 కోట్లకు చేరుకుంది. 2022లో నమోదైన 243 కోట్ల కంటే 5.95 శాతం తగ్గింది. EBITDA 166.10 కోట్లకు చేరుకుంది. కంపెనీ EPS 8.88 కి వెళ్లింది.

'గత 11 త్రైమాసికాల్లో 20 శాతం వృద్ధితో మా వ్యాపార స్థూల లాభాలు దూసుకుపోతున్నాయి. మా సంస్థ మార్జిన్లు సైతం 20 శాతానికి తిరిగి చేరాయి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతామని విశ్వసిస్తున్నాం' అని తాన్లా ప్లాట్ ఫారమ్స్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ & CEO ఉదయ్ రెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం కంపెనీ షేరు విలువ NSEలో 678.20 వద్ద ముగిసింది. 52 వారాల గరిష్ఠ స్థాయి 1,510.00 మరియు కనిష్ఠ స్థాయి 493.00గా ఉంది.


Click it and Unblock the Notifications