ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగా కాస్ట్ కటింగ్ మొదలు పెట్టిన సంగతి విదితమే.వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో AI టూల్స్ వాడుతూ ఉద్యోగ కోతలను కోస్తోంది.
తాజాగా మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ అల్తాఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, కేవలం కాల్ సెంటర్ ఆపరేషన్లలో ఏఐ వాడటం ద్వారా 500 మిలియన్ డాలర్లు పొదుపు చేశామని తెలిపారు. ఇది మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 4,285 కోట్లు. 9 వేల మంది ఉద్యోగుల స్థానంలో ఈ ఏఐని ఉపయోగించామని తద్వారా మనీ ఆదా చేయగలిగామని తెలిపారు. ఇది కస్టమర్ సంతృప్తిని, ఆర్గనైజేషన్ లోపల సమర్థతను పెంచడంలో కూడా సహాయపడిందన్నారు.

మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన Copilot AI అసిస్టెంట్ సేల్స్ టీమ్‌లకు లీడ్స్ జనరేట్ చేయడంతో పాటు డీల్స్ క్లోజ్ చేయడం వంటి పనులు చేస్తోంది.అదే విధంగా, కొత్త ఉత్పత్తుల కోడ్ లో 35 శాతం కోడింగ్ ఇప్పుడు AI ద్వారానే రాస్తున్నారు. GitHub Copilot అనే కోడింగ్ AI టూల్ ఇప్పటికే 15 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. AI వినియోగం ద్వారా చిన్న క్లయింట్లతో కూడిన కస్టమర్ ఇంటరాక్షన్లలో కూడా మైక్రోసాఫ్ట్ కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తోంది.
అయితే, ఈ AI ఆధారిత మార్పులు మానవ ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవలే మైక్రోసాఫ్ట్ మరోసారి 9,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగులలో సుమారు 4 శాతంగా ఉంది.
ఈ తాజా తొలగింపులు మైక్రోసాఫ్ట్ 2023లో చేసిన 10,000 ఉద్యోగాల కోతలు తర్వాత జరిగిన అతిపెద్ద చర్యగా చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా, సేల్స్‌ఫోర్స్, మెటా, గూగుల్ (Alphabet) వంటి ఇతర టెక్ కంపెనీలు కూడా AI ప్రభావంతో ఉద్యోగాలను తొలగించే ప్రక్రియలో ఉన్నాయి. సత్య నాదెళ్ల గతంలో చెప్పినట్లు, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ యొక్క 20-30% కోడ్ AI ద్వారానే రాయబడుతోంది.
AI సంస్థలకు ఆదాయం పెంచే మార్గంగా నిలుస్తున్నా ఉద్యోగ భద్రతపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. వేలాది మంది ఉద్యోగుల రోడ్డు మీద పడుతున్నారు. మైక్రోసాఫ్ట్ తరహా దిగ్గజాలు AI ఆధారంగా ఖర్చులు తగ్గించుకోవడానికి అలాగే ఉత్పాదకత పెంపు కోసం ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది.


Click it and Unblock the Notifications