ముంబై: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ కార్యాలయాలను పునరుద్ధరించే విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కార్యాలయాల పునరుద్ధరణను వాయిదా వేసుకుంది. ఎప్పుడు పునఃప్రారంభించే తేదీని కూడా వెల్లడించింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇదివరకు మైక్రోసాఫ్ట్ సంస్థ యాజమాన్యం.. తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. ఇప్పుడు కూడా కరోనా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం, పైగా పలుు దేశాల్లో సెకెండ్, థర్డ్ వేవ్ వెలుగులోకి రావడం వంటి కారణాల వల్ల కార్యాలయాల పునరుద్ధరణను మరింత కాలం పాటు వాయిదా వేసింది.
ఆ సంస్థ యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. కార్యాలయాల పునరుద్ధరణ వ్యవహారం వచ్చే సెప్టెంబర్ 7వ తేదీ వరకు వాయిదా పడింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాలోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగులు, డేటా నిపుణులను సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. దేశం/రీజియన్/రాష్ట్రం ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ స్థితిగతులపై ఆరా తీశామని అన్నారు.

నిజానికి- మార్చి చివరివారంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయాలను పునఃప్రారంభించాల్సి ఉంది. ఆరు విడతల్లో కార్యాలయాలన్నింటినీ తెరవడానికి ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సైతం సిద్ధం చేసిందా సంస్థ యాజమాన్యం. గడువు ముగుస్తోన్న సమయంలో.. కార్యాలయాల పునరుద్ధరణ చర్యలను వాయిదా వేసుకుంటున్నట్లు సంస్థ ఉద్యోగులందరికీ ఇ-మెయిల్ ద్వారా తెలియజేసింది. మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభించాలనే విషయంపై అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తాజాగా తేదీని ప్రకటించింది.
సెప్టెంబర్ 7వ తేదీన వాటిని తెరుస్తామని, అప్పటిదాకా సంస్థ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్‌బెన్ తెలిపారు. భారత్ సహా మొత్తం 21 దేశాల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. 1,60,000 మందికి పైగా సాఫ్ట్‌వేర్ నిపుణులు ఆ సంస్థలో పని చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ సహా యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వసతిని కల్పించాయి. ఏడాది తరువాత కూడా కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల సంస్థ కార్యాలయాల పునరుద్ధరణను మైక్రోసాఫ్ట్ మరి కొంతకాలం వాయిదా వేసుకుంది.


Click it and Unblock the Notifications