ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మైక్రోసాఫ్ట్ బాస్ కీలక కామెంట్స్.. ChatGPTకి సమీప ప్రత్యర్థి ఏదంటే..
AI: ChatGPT తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై IT దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన పరిశోధనా సంస్థలు మరియు కంపెనీలు.. ChatGPTకి ప్రధాన ప్రత్యర్థులుగా ఎదుగుతాయని హెచ్చరించినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. కాగా AI ఆధారిత చాట్ బాట్ డెవలపర్ OpenAIలో ఈ టెక్ దిగ్గజం అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉందన్న విషయం గమనార్హం.
ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం.. ఉత్పాదక AI అభివృద్ధిలో అమెజాన్, గూగుల్ వంటి US టెక్నాలజీ దిగ్గజాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అయితే ఈ విషయంలో చైనా పెద్దగా ఏమీ వెనుకబడి లేదని మైక్రోసాఫ్ట్ బాస్ అభిప్రాయపడ్డారు. టోక్యోలో నిక్కీ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. AI విషయానికి వస్తే.. మైక్రోసాఫ్ట్ OpenAI, గూగుల్, బీజింగ్ అకాడమీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడూ ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేవలం నెలల వ్యవధి మాత్రమే బేధం ఉంటుందన్నారు.

ChatGPT వెనుక ఉన్న సాంకేతికత జనరేటివ్ AI.. అధునాతన స్థాయిలో టెక్స్ట్ మరియు ఇమేజ్‌లను ఉత్పత్తి చేయగలదు. వ్యాపారం, కళలు, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో దాని సామర్థ్యంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ అనేక ఉద్యోగాలను ఆటోమేట్ చేయడం ద్వారా ప్రస్తుత కార్మికులను నిరుద్యోగం వైపు నెట్టివేస్తుందనే భయాందోళనలను రేకెత్తించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే కాక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, కాపీరైట్ ఉల్లంఘన, గోప్యతలో ఇబ్బందులు, సున్నితమైన సమాచారాన్ని లీక్ చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశమూ లేకపోలేదంటున్నారు.
ఈ తరహా ఆందోళనలకు పరిష్కారం ఆవిష్కరణలను ఆపడం కాదని, ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు మెరుగుపరచడమని బ్రాడ్ స్మిత్ వ్యాఖ్యానించారు. ఇతర సాంకేతిక పరిజ్ఞానాల మాదిరిగానే AI కూడా సైబర్ దాడులు వంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఓ సాధనంగా, ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ఆసియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటైన కార్మికుల కొరతను ఈ సాంకేతికత పరిష్కరించగలదని భావిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications