IT News: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో మరోమారు అలజడి.. వందలాది మందికి ఉద్వాసన
Layoffs News: కరోనా కోరల నుంచి బయటపడి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగుల తొలగింపుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. మొదట్లో ఆర్థిక మందగమనం పేరిట సిబ్బందిని ఇంటికి పంపించిన కంపెనీలు.. తదనంతరం అభివృద్ధి కార్యకలాపాలకు ఫండింగ్ అంటూ లేఆప్స్ ఇస్తున్నాయి. ఇప్పటికే పలు రౌండ్ల పాటు ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. మరోమారు అంటూ ప్రతిసారీ అదేపాట పాడుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగం నుంచి మరో 650 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపులు ప్రధానంగా కార్పొరేట్ మరియు సపోర్ట్ రోల్స్‌ను ప్రభావితం చేయనున్నట్లు Xbox చీఫ్ ఫిల్ స్పెన్సర్ నుంచి వచ్చిన మెమోలో పేర్కొన్నట్లు సమాచారం. గతేడాది యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసిన తర్వాత గేమింగ్ వ్యాపారాన్ని పునర్నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య ఒక భాగమని తెలుస్తోంది.

అయితే ఈ తొలగింపుల కారణంగా ఎలాంటి గేమ్‌లు, పరికరాలు లేదా స్టూడియోలు రద్దు చేయబడటం లేదా మూసివేయబడటం లేదని ఫిల్ స్పెన్సర్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీర్ఘకాలంలో కంపెనీని విజయవంతంగా నడింపించడానికి, వ్యాపార నిర్వహణపై పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ మార్పుల వల్ల కంపెనీ తన గేమ్ స్టూడియోలు మరియు వ్యాపార యూనిట్లకు మరింత సమర్ధవంతంగా సపోర్ట్ చేయడంలో సహాయపడతాయని వివరించారు.
మైక్రోసాఫ్ట్ 2023లో యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను 69 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అప్పటినుంచి తన గేమింగ్ టీమ్‌లకు సమాంతరంగా సర్దుబాట్లు చేస్తూ వస్తోంది. కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ గేమింగ్ వ్యాపారం నుంచి 2 వేల 550 మంది కొలువులు కోల్పోయారు. కంపెనీ గేమింగ్ రాబడి పెరిగినప్పటికీ Xbox వ్యాపారంలోని ఇతర భాగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications