IT News: కరోనా ఉద్ధృతి కొనసాగిన వేళ స్టార్టప్‌లు సహా చిన్న కంపెనీలు ఎక్కువగా లేఆఫ్స్ ప్రకటించాయి. ఖర్చులు భరించలేక, రెవెన్యూ జనరేట్ చేయలేక ఇబ్బంది ఎదుర్కొన్నాయి. ఇక విధిగాని పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు తప్ప మరొక మార్గం లేకపోయింది. కానీ దిగ్గజ కంపెనీల పరిస్థితి అలా కాదు. పేరుకు మాత్రం ఖర్చులు తగ్గింపు అని చెప్పుకుంటూ, ఆ మొత్తాన్ని AI వంటి కొత్త టెక్నాలజీల అభివృద్ధి దిశగా మళ్ళిస్తూ డబల్ గేమ్ ఆడుతున్నాయి.
ప్రపంచస్థాయి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి లేఆఫ్స్‌తో విరుచుకుపడింది. ఈ ఏడాది జనవరిలో 10 వేల మందిని తొలగించగా.. మరోసారి వెయ్యి మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఈ మధ్యలోనూ అడపాదడపా కొద్ది మొత్తంలో సిబ్బందిని తొలగిస్తూనే వస్తోంది. కాగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మిక్స్డ్ రియాలిటీ, అజూర్ విభాగాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెండు సెగ్మెంట్ ఉద్యోగులు లేఆఫ్స్ వల్ల ప్రభావితం కానున్నట్లు సమాచారం.

ఓ పక్క ఉద్యోగులను తొలగిస్తూనే మరోపక్క మిక్స్‌డ్ రియాలిటీలోని హాలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాల్టీ హెడ్సెట్ అమ్మకాలను కొనసాగిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఉన్న తమ కస్టమర్లకు సపోర్ట్ ఇచ్చే విషయంలో వెనకడుగు వేయమని హామీ ఇచ్చింది. రక్షణ శాఖకు సంబంధించి IVASకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. మిక్స్‌డ్ రియాలిటీ హార్డ్వేర్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం కంటిన్యూ చేస్తామని వెల్లడించింది.
ఇక అజూర్ టీం పై కూడా మైక్రోసాఫ్ట్ తన మార్కును చూపించింది. మిషన్ ఇంజనీరింగ్, అజూర్ ఫర్ ఆపరేటర్స్ విభాగాల్లో వందలాది మందిని ఇంటికి పంపుతోంది. స్పేస్ టెక్నాలజీస్, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికల డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో ఇది అంతర్భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. కానీ ఇందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications