Microsoft News: అమెరికాకు చెందిన ప్రపంచ టెక్ దిగ్గజ భారతీయ సీఈవో సత్య నాదెళ్ల వచ్చే నెలలో ఇండియా వస్తున్నారు. అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని ప్రకటించటంపై ఆసక్తి పెరిగింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల తన గేమింగ్ విభాగంలో 1,900 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో విలీనంతో దీర్ఘకాలిక వృద్ధికి కొత్త పునాది వేసింది. అయితే నాదెళ్ల తన వార్షిక పర్యటలో భాగంగా ఫిబ్రవరి 7,8 తేదీల్లో భారత్‌కు రానున్నట్లు సమాచారం.

మైక్రోసాఫ్ట్ AI భవిష్యత్తు అని ఖచ్చితంగా చెప్పినప్పటికీ.. దేశంలో తన డేటా సెంటర్లు, కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అయితే ఈ సారి పర్యటనలో ముఖ్యంగా నాదెళ్ల ఇండియాలోని ఏఐ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులను కలవాలని భావిస్తున్నట్లు సమాచారం. వారితో ఈ రంగంలోని కొత్త అవకాశాలను చర్చించాలని భావిస్తున్నారు. భారత సంతతి సీఈవో కావటంతో ఆయన పర్యటనకు పెద్దపీట వేయటం ఖాయంగా తెలుస్తోంది.
అలాగే ఈ పర్యటనలో సత్య నాదెళ్ల AI రంగంలో కొత్త అవకాశాలను అన్వేషించడంపై సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని వారాల కిందట ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చందోక్ నాదెళ్ల పర్యటనకు సంబంధించిన ప్లాన్ గురించి వెల్లడించారు.
గతవారం మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ క్యాప్ అత్యధికంగా 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవటంతో జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆపిల్ తర్వాత ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన రెండవ అమెరికన్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ చరిత్ర సృష్టించింది. కంపెనీ తన 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ మైలురాయిని భారత సీఈవో సత్యనాదెళ్ల నాయకత్వంలో అందుకోవటం గర్వకారణం.


Click it and Unblock the Notifications