Hyderabad News: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూపర్ నిర్ణయం..
Microsoft News: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలను తక్కువ ఖర్చుకు అందించటంలో భారత టెక్ కంపెనీలు సఫలమయ్యాయి. ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యూఎస్, యూరోపియన్ మార్కెట్లకు ఇండియన్ ఐటీ కంపెనీలు క్లయింట్లను అధికంగానే కలిగి ఉన్నాయి.
భారతదేశం గ్లోబల్ టెక్ కంపెనీలకు గుండె లాంటిది. పైగా ప్రపంచ టెక్ కంపెనీలకు తమ ఆఫీసు కార్యకలాపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉత్తమమైన నగరంగా హైదరాబాద్ చాలా కాలంగా కొనసాగుతోంది. గతంలో బెంగళూరు ఈ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ.. యువ టెక్కీల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కనెక్టివిటీ, పుష్కలంగా నీటి వనరుల లభ్యత, నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ మెరుగుపడిన వేళ తెలంగాణ వైపు ప్రపంచ టెక్ కంపెనీల చూపు ఉంది.

ఈ పరిస్థితిలో విదేశీ టెక్ కంపెనీలు ఇండియాలో కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటి క్యూ కడుతున్న వేళ డిజిటల్ సేవలకు రోజురోజుకూ పెరుగుతున్న సమర్థవంతమైన డేటా సెంటర్ల అవసరం పెరిగిపోతోంది. ఈ క్రమంలో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లందరూ తమ డేటా సెంటర్లను విస్తరిస్తున్నాయి. భారతీయ ఐటీ పాలసీ ప్రకారం దేశంలోని ప్రజల డేటా ఇక్కడి సర్వర్లలోనే నిక్షిప్తం చేయాల్సి ఉన్నందున దేశంలో డేటా సెంటర్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తెలంగాణలో తన సొంత డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భారత సంతతి సీఈవో సత్య నాదెళ్ల నేతృత్వంలోని కంపెనీ హైదరాబాద్‌లో దాదాపు రూ.267 కోట్ల విలువైన 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రంగారెడ్డి జిల్లాలో ల్యాండ్ హోల్‌సేల్ వ్యాపారి సాయి బాలాజీ డెవలపర్స్ నుంచి దీనిని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరణ ప్రణాళికలకు ఇది అద్దం పడుతోంది. ఈ ప్రాంతంలో అతిపెద్ద డేటా సెంటర్‌లలో ఒకదానిని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్న ప్రాంతం హైదరాబాద్ నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉందని సమాచారం.
హైదరాబాద్ డేటా సెంటర్‌ను మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తారు. ఇది ముంబై, చెన్నై, పూణే ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా పనిచేస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్ వ్యాపారం కోసం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో మరో రెండు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న డిజిటల్ రెవల్యూషన్ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున డేటా వినియోగించటం, క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగటంతో ఈ రంగంపై అదానీ, రిలయన్స్ వంటి భారతీయ వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులను పెట్టిన సంగతి తెలిసిందే. ఇండియాలో డేటా సెంటర్ల వ్యాపారం రాకెట్ వేగంతో వృద్ధి చెందుతోంది. బెంగళూరు, నోయిడాతో పాటు.. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో తన అతిపెద్ద డెవలప్‌మెంట్ సెంటర్‌ను 54 ఎకరాల్లో నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications