Microsoft: మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్..! ఫినోలెక్స్ పైపుల కంపెనీతో ఒప్పందం..
Microsoft: భవిష్యత్ అవసరాలకు సంబంధించిన సాంకేతికతల కోసం మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరణ బాట పట్టింది. ఈ క్రమంలో భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇప్పటికే రిలయన్స్ జియోలో భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ ఇప్పుడు మరో ప్రాజెక్టుకు అంతా సిద్ధమైంది.

25 ఎకరాల్లో..
దేశంలోని ప్రముఖ PVC పైపుల తయారీ సంస్థ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ నుంచి మైక్రోసాఫ్ట్ భూమిని కొనుగోలు చేస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 25 ఎకరాల భూమిని సేకరిస్తోంది. డేటా వ్యాపారంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ కు గట్టి పోటీదారుగా నిలిచేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపకరించనుంది.

మహారాష్ట్ర కేంద్రంగా..
దేశంలో కొత్త డేటా సెంటర్‌ను మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పింప్రిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని 25 ఎకరాల భూమిని రూ.328.84 కోట్లకు మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.16.44 కోట్లు స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు వెల్లడైంది.

2027 నాటికి..
డేటా వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ భారత్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించింది. 2021లో భారత వ్యాపారం 4.35 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. 2027 నాటికి ఇది 10.09 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. భారతీయుల డేటాను భారతదేశంలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటంతో అన్ని విదేశీ కంపెనీలు ఇక్కడ తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications