భారత్‌లో మైక్రోసాఫ్ట్ అత్యంత భారీ పెట్టుబడి.. AIలో 1.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్..లక్షల ఉద్యోగాలు
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశం అనంతరం నాదెళ్ల పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు. భారత్ లో 1.5 లక్షల కోట్లు (17.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడిని పెడుతున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆసియాలో చేయబోతున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే. అదే పోస్టులో ప్రధాని మోదీతో కలిసి తీసుకున్న ఫోటోను కూడా నాదెళ్ల పోస్టు చేశారు. భారతదేశంలో AI అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ధన్యవాదాలు ప్రధాని నరేంద్ర మోదీ. దేశం యొక్క ఆశయాలను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ $17.5 బిలియన్ పెట్టుబడి పెడుతోందని సత్య నాదెళ్ల ఆ పోస్టులో తెలిపారు.
Microsoft ప్రకటన ప్రకారం.. ఈ పెట్టుబడి భారతదేశంలో AI వృద్ధిని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను, దేశీయ టెక్నాలజీ మౌలిక సదుపాయాలను బలపరుస్తుంది. పెట్టుబడి మూడు ప్రధాన స్తంభాలపై దృష్టి సారిస్తుంది అవేంటంటే.. విస్తరణ, నైపుణ్యాలు, సార్వభౌమాధికారం. కంపెనీ ప్రతిపాదనలో తెలిపిన విధంగా.. ఈ పెట్టుబడి భారతదేశంలోని క్లౌడ్, డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను విస్తరించి, AI ప్రాజెక్టులకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.

అదేవిధంగా, మైక్రోసాఫ్ట్ భారత యువతకు అత్యాధునిక AI, క్లౌడ్ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి వివిధ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రారంభించనుంది. దీని ద్వారా భారతీయులు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను పొందుతారు. అలాగే, కంపెనీ సార్వభౌమాధికరంపై దృష్టి సారిస్తూ, డేటా భద్రత, ప్రభుత్వ సంబంధిత క్లౌడ్ సర్వీసుల నిర్వహణ, దేశీయ డేటా పాలసీలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది.
మైక్రోసాఫ్ట్ తెలిపిన ప్రకటన ప్రకారం.. రాబోయే దశాబ్దంలో భారత్‌ను డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దశ నుండి AI పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దశకు తీసుకెళ్ళడం లక్ష్యంగా పెట్టారు. ఇది దేశాన్ని గ్లోబల్ AI సప్లై చైన్‌లో కీలకమైన భాగంగా మార్చేలా ఉంది. పెట్టుబడి వల్ల దేశవ్యాప్తంగా AI డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు, స్టార్టప్ కంపెనీలు, వ్యాపార రంగాలు, ఆరోగ్యం, రవాణా, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా వేగవంతమైన AI ఆధారిత పరిష్కారాలను చూడవచ్చు.
ఈ పెట్టుబడితో భారతదేశం భవిష్యత్తులో AI లీడర్‌గా ఎదగడానికి దోహదపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమావేశం భారత ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ రంగ అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో AI వృద్ధిని ముందుకు నడిపేందుకు మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని, ఇది దేశానికి మాత్రమే కాక, ఆసియా ఖండానికి కూడా ప్రాముఖ్యత కలిగించే పెట్టుబడి అని నాదెళ్ల స్పష్టం చేయడం... ఏఐ రంగంలో భారతదేశ భవిష్యత్తు మారబోతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications