Bengaluru News: రెండు గంటలు నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు..
బెంగళూరు మెట్రో సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం సుమారు 5:50 గంటలకు హోసూర్ రోడ్డులోని హస్కర్ స్టేషన్‌లో కదులుతున్న రైలు ముందు దూకి ఒక ప్రయాణికుడు ఆత్మహత్య చేసుకోవడంతో నమ్మ మెట్రో యెల్లో లైన్ సేవలు రెండు గంటలకు పైగా నిలిచిపోయాయి. ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని హుస్కూర్ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద, 37 ఏళ్ల వ్యక్తి ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కారణంగా ఎల్లో లైన్‌లో మెట్రో సేవలకు రెండు గంటలకు పైగా అంతరాయం ఏర్పడింది.
మృతుడు రాయచూర్‌కు చెందిన రాజేష్ హిరేమత్ బెంగళూరులోని అనంతనగర్ నివాసం ఉంటున్నారు. అతను గతంలో ఒక డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో లెక్చరర్‌గా, కంటెంట్ రైటర్‌గా, ఎడిటర్‌గా పనిచేశాడు. గత నాలుగు నెలలుగా అతను నిరుద్యోగిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన సాయంత్రం 5.50 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రైలు ఆపరేటర్ పట్టాలపై ఒక వ్యక్తిని గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని చెప్పారు. కానీ రైలు సమయానికి ఆగలేక అతనిపై నుంచి దూసుకెళ్లిందని పోలీసులు వివరించారు. ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. రైలు ఆపరేటర్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించగా వారు ప్రభావిత ప్రాంతంలో ట్రాక్షన్ పవర్‌ను నిలిపివేశారని బీఎంఆర్‌సీఎల్ తెలిపింది. స్టేషన్ సిబ్బందిని, మెట్రో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయగా, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఇతర అధికారులు రైలు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రభావితమైన ప్లాట్‌ఫారాన్ని భద్రపరిచి, చట్టబద్ధమైన ప్రక్రియలు, ట్రాక్ క్లియరెన్స్, భద్రతా తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే సేవలను పునరుద్ధరించారు.
ఈ ఘటన కారణంగా సాయంత్రం 5.55 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎల్లో లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ, ఈ అంతరాయం సమయంలో ఎలక్ట్రానిక్ సిటీ, రాష్ట్రీయ విద్యాలయ రోడ్ మధ్య రైళ్లు నడిచాయి. రాత్రి 7.42 గంటలకు ట్రాక్షన్ పవర్‌ను పునరుద్ధరించగా, రాత్రి 7.57 గంటలకల్లా సాధారణ రైలు కార్యకలాపాలు, ప్రయాణీకుల రాకపోకలు కొనసాగాయి. నియంత్రిత సేవలు, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల గురించి ప్రయాణికులకు తెలియజేయడానికి స్టేషన్లలో, రైళ్ల లోపల నిరంతర ప్రకటనలు చేశామని మెట్రో పేర్కొంది. అలాగే ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్‌లను అప్‌డేట్ చేశామని బీఎంఆర్‌సీఎల్ ప్రకటించింది. ఈ మధ్య కాలంలో మెట్రో రైళ్లు ఆగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లను కొంత సమయం నిలిపివేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications