ఇండియాకు మెట్రో గుడ్‌బై? కొనుగోలుకు అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ పోటీ?
జర్మనీకి చెందిన ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ మెట్రో స్టోర్స్ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సమాచారం. 19 సంవత్సరాలపాటు భారత్‌లో కొనసాగిన మెట్రో ఇక్కడి ఫలితాలు ఆశించినరీతిలో లేకపోవడంతో దేశాన్ని వీడివెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

100 శాతం విదేశీ పెట్టుబడులతో..
100 శాతం విదేశీ పెట్టుబడులతో దేశంలోని ప్రధాన నగరాల్లో సంస్థ స్టోర్లు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో తొలి మెట్రో స్టోర్ ఏర్పాటు కావడం అప్పట్లో సంచలనం కలిగించింది. దేశవ్యాప్తంగా 21 నగరాల్లో ప్రస్తుతం 31 స్టోర్లను మెట్రో నిర్వహిస్తోంది. మెట్రో ప్రవేశించిన తర్వాత భారత్‌లో అనేక సంస్థలు ఇదే నమూనాను అనుసరిస్తూ రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో పోటీ ఎక్కువైంది. భవిష్యత్తు మరింత క్లిష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో భారత్‌లో వ్యాపారాన్ని మూసేయాలని నిర్ణయించుకుంది.

రూ.1.25 బిలియన్ల డాలర్ల వ్యాపారం
అంతే కాకుండా ఏపీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో మెట్రోకు ఐదు కలెక్షన్ కేంద్రాలున్నాయి. ఏడువేల రకాల వస్తువులను ఈ స్టోర్లలో అమ్ముతున్నారు. 2025 నాటికి ఈ సంస్త 1.25 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

31 స్టోర్లు, 5 కలెక్షన్ కేంద్రాలు
దేశవ్యాప్తంగా ఉన్న 31 స్టోర్లు, ఐదు కలెక్షన్ కేంద్రాలను, ఇతర స్థిర చరాస్తులను కొనుగోలు చేసేందుకు బయ్యర్‌ను వెతికిపెట్టాల్సిందిగా మెట్రో జేపీ మోర్గాన్‌ను కోరింది. రూ.1.5 నుంచి రూ.1.75 బిలియన్ డాలర్లకు అమ్మకం జరగవచ్చని బిజినెస్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ వంటి సంస్థలు మెట్రోను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతోనే..
ప్రపంచవ్యాప్తంగా తమకు వ్యాపారలున్నాయని, ప్రతి సంవత్సరం తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలు, వాటిని చేరుకున్న తీరును మదింపు చేసుకుంటామని, అందులో భాగంగానే భారత్‌కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నామని, అంతకుమించి ప్రత్యేకమైన కారణాలేవీ లేవని మెట్రో గ్లోబల్ హెడ్ జెర్డ్ కోస్‌లోవ్‌స్కీ వెల్లడించారు. మెట్రో స్టోర్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి. కొంతకాలంగా సంస్థ ఆశించిన మేరకే ఫలితాలు లేకపోవడంతో జపాన్, రష్యా, మయన్మార్ దేశాల్లో ఉన్న తమ స్టోర్లను కంపెనీ మూసేసింది. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది.


Click it and Unblock the Notifications