Instagram: మార్క్ జుకర్ బర్గ్ సారథ్యంలోని ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాంలు ఎంత పాపులరో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు మార్కెట్ లోని సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించడంలో మెటా సంస్థ ముందుటుంది. తాజాగా Instagram లో తీసుకురానున్న ఓ నూతన ఆప్షన్ పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో దీన్ని ఓ గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు.

టెలిగ్రాంలో మాదిరిగా..
టెలిగ్రాం తరహాలో Instagram లోనూ ఛానెల్స్ ఏర్పాటుకు మెటా సిద్ధమవుతోంది. ఈ కొత్త ఫీచర్ మొబైల్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ గురువారం ప్రకటించారు.
మెటాలో నిర్మించిన అన్ని ఉత్పత్తులకు సంబంధించిన వార్తలు, అప్ డేట్ లను ఈ ఫీచర్ ద్వారా షేర్ చేసుకోవచ్చని తెలిపారు. టెక్స్ట్, ఇమేజ్, పోల్స్, రియాక్షన్లు వంటి పలు రకాల మీడియా ఫార్మాట్ లను ఇందులో వినియోగించవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని హంగులు జోడించనున్నట్లు చెప్పారు.

ఫాలోవర్లతో కమ్యూనికేషన్ ఛానెల్ గా
కంటెంట్ క్రియేటర్స్ వివిధ రకాల ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్, పోల్స్ ను ఫాలోవర్లతో పంచుకునేందుకు Instagram ఛానెల్స్ మరింత ఉపయోగపడతాయని కంపెనీ భావిస్తోంది. తాజా అప్డేట్ లను షేర్ చేసుకునేందుకు కమ్యూనికేషన్ ఛానెల్ గా వినియోగించవచ్చని మెటా తెలిపింది. ప్రస్తుతం ఆస్టిన్ స్ప్రింజ్, క్లో కిమ్, డేవిడ్ అలెన్, గిల్బర్ట్ బర్న్స్ వంటి ఎంపిక చేసిన కంటెంట్ సృష్టికర్తల సమూహంతో ఈ ఫీచర్ ని పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

ఛానల్ లో అనుచరులు మాత్రమే..
మొదటగా ఛానెల్ కు కంటెంట్ క్రియేటర్ యాక్సెస్ పొందాల్సి ఉంటుంది. అనంతరం వారి Instagram ఇన్ బాక్స్ నుంచి పంపిన సందేశం ద్వారా ఫాలోవర్స్ కు నోటిఫికేషన్ వెళ్తుంది. ఛానల్ లో చేరిన అనుచరులు మాత్రమే అప్ డేట్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ లు అందుకోగలరు. ఎప్పుడైనా ఛానెల్ ను వదిలివేయడానికి, మ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బెల్ సింబల్ ను వినియోగించి నోటిఫికేషన్లను సైతం నియంత్రించవచ్చు.

స్పందించవచ్చు కానీ..
ఛానెల్ క్రియేట్ చేసుకున్న అనంతరం 'జాయిన్ ఛానెల్' స్టిక్కర్ లేదా ప్రొఫైల్ లో ఛానెల్ లింక్ ను పిన్ చేయడం ద్వారా తమ ఫాలోవర్లను అందులో చేరేవిధంగా ప్రోత్సహించవచ్చు. వారు చేరిన అనంతరం, కంటెంట్ పై స్పదించే అవకాశం ఉంటుంది. పోల్స్ లో ఓటు కూడా వేయవచ్చు కానీ సందేశాలను మాత్రం పంపించలేరు.


Click it and Unblock the Notifications