Content labelling: ఆర్థికాభివృద్ధిలో అగ్రరాజ్యాలతో పోటీపడుతున్న భారత్‌ను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. నూతనంగా తన పరిధిని విస్తరించుకుంటూ పోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పలు ఆర్థిక నేరాలతో పాటు డీప్-ఫేక్ వీడియోలు భారత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు రావచ్చని అర్థం చేసుకోవచ్చు.
ఈ తరహా మానిప్యులేటెడ్ కంటెంట్‌ను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. వచ్చే నెల నుంచి AI రూపొందించిన కంటెంట్‌ని లేబుల్ చేయడం ప్రారంభించనుంది. దాని స్వతంత్ర పర్యవేక్షణ బోర్డు సూచనల ప్రకారం ఈ కొత్త విధానం అమలు చేయనున్నట్లు తెలిపింది.

మెటా అధికారిక ప్రకటన ప్రకారం.. ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సహా దాని ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృత శ్రేణి వీడియో, ఆడియో మరియు ఇమేజ్ కంటెంట్‌ను క్లియర్ గా గమనిస్తున్నట్లు చెప్పింది. 'ఓవర్‌సైట్ బోర్డ్ నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పబ్లిక్ ఒపీనియన్ సర్వేలు మరియు నిపుణుల సంప్రదింపులతో మా పాలసీకి మార్పులు చేశాం. రివ్యూ ప్రాసెస్ ఆధారంగా మానిప్యులేటెడ్ మీడియాను హ్యాండిల్ చేయనున్నాం' అని తెలిపింది.
కొత్త AI వీడియో సాధనాలు ఎన్నికలకు ముందు డీప్‌ఫేక్‌ల ఆందోళనను పెంచుతాయని అంచనాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఓటర్లను తప్పుదారి పట్టించవచ్చని, గందరగోళానికి గురిచేసే అవకాశం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత 'మానిప్యులేటెడ్ మీడియా' నియమాలు AI ద్వారా సృష్టించబడిన లేదా మార్చబడిన వీడియోలకు మాత్రమే వర్తిస్తాయని మెటా పేర్కొంది. ఓ వ్యక్తి చెప్పని విషయాన్ని ఇవి చెప్పినట్లు కనిపించేలా చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఫిబ్రవరి నుంచి AI ఫీచర్‌తో రూపొందించబడిన ఫోటోరియలిస్టిక్ చిత్రాలకు 'AI ఇమాజిన్డ్' లేబుల్‌లను జోడించడం మెటా ప్రారంభించింది.


Click it and Unblock the Notifications