Layoffs: ముచ్చటగా మూడోసారి మెటాలో లేఆఫ్.. ఈసారి బలైంది ఎంతమంది అంటే..
Layoffs: గత ఏడాదిన్నరగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు లేఆఫ్స్ మోత మోగిస్తున్నాయి. లక్షలాది మంది కొలువులు కోల్పోయి, ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకే కంపెనీ పలు మార్లు సిబ్బంది సంఖ్యలో కోత విధిస్తుండటంతో వీటికి ఫుల్ స్టాప్ ఎప్పుడో తెలియక ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని ఇంటికి పంపిన ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా తాజాగా మరోసారి కోతలకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 6 వేల మందిని ఉద్యోగం నుంచి మెటా తొలగించింది. "ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ"లో భాగంగా ఈ కోతలు విధించినట్లు పేర్కొంది. తద్వారా సంస్థ ఖర్చులను తగ్గించుకుంటూ, పునర్నిర్మించబడుతోందని వెల్లడించింది. మూడో దఫా జాబ్ కట్స్ వల్ల మెటాకు చెందిన పలు వ్యాపార విభాగాలు ప్రభావితం అయినట్లు తెలుస్తోంది.

ఈ లేఆఫ్స్ గురించి మెటా ఫౌండర్ మరియు CEO మార్క్ జుకర్‌బర్గ్ గత మార్చిలోనే వెల్లడించారు. ఏప్రిల్ మరియు మే చివరి నాటికి వరుసగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపారు. మరో 5 వేల పొజిషన్స్ ను పూర్తిగా మూసివేయాలని భావిస్తున్నట్లు ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే గతేడాది నవంబరులో 11 వేల పాత్రలను తొలగించింది. వివిధ డిపార్ట్ మెంట్స్ లో మొత్తం 21 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు.
పది వేల మందిని తొలగించాలని తొలుత భావించిన టెక్ దిగ్గజం.. గత నెలలో కేవలం 6 వేల మందిని ఇంటికి పంపింది. మిగిలిన 4 వేల మందికి ఉద్వాసన పలకలేదు. తప్పుడు సమాచారాన్ని గుర్తించి, ఎదుర్కొనే టీమ్ మొత్తాన్ని దాదాపు తుడిచిపెట్టేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2022 చివరి నాటికి Metaలో దాదాపు 86 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.


Click it and Unblock the Notifications