రూ.3 కోట్ల జీతం.. కానీ ఇంట్లో కనీసం టీవీ, సోఫా కూడా లేవు.. ఈ ఇంజనీర్ కథ వింటే షాకవుతారు!
ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ చేతినిండా సంపాదిస్తే చాలు.. చాలామంది ఇళ్లు, కార్లు, లగ్జరీ వస్తువులు కొంటూ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ, ఒక యువకుడు మాత్రం ఏటా రూ.3 కోట్లకు పైగా సంపాదిస్తున్నా.. ఇంట్లో కనీసం టీవీ, సోఫా, బయటకు వెళ్లడానికి సొంత కార్ కూడా లేకుండా చాలా సింపుల్ గా బతుకుతున్నాడు. ప్రస్తుతం ఇతని లైఫ్ స్టైల్ గురించిన వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండింగ్ (trending) అవుతోంది.
మెటా (Meta) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల రేమండ్ జెంగ్ (Raymond Zeng) కథ ఇది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నివసిస్తున్న రేమండ్, అంత భారీ జీతం వస్తున్నా ఆడంబరాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో 'బిజినెస్ ఇన్‌సైడర్' ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

స్పార్టన్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి?
రేమండ్ ఉంటున్న ఫ్లాట్ చూసిన అతని ఫ్రెండ్స్ అంతా అది చాలా "స్పార్టన్" (కఠినమైన లేదా అత్యంత సాదాసీదా) లైఫ్ స్టైల్ అని చెప్తుంటారట. "నా రూమ్ లో ఒక డెస్క్ (టేబుల్), ఒక రూంబా (వ్యాక్యూమ్ క్లీనర్) తప్ప పెద్దగా ఫర్నిచర్ ఏమీ ఉండదు. నా దగ్గర కార్ లేదు, కూర్చోవడానికి సోఫా లేదు, కనీసం టీవీ కూడా లేదు" అని రేమండ్ చెప్పాడు.
వస్తువులను కొని ఇల్లు నింపడం కంటే, జీవితంలో మంచి అనుభూతులను పొందడానికే తను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని రేమండ్ అంటున్నాడు. ప్రస్తుతం తను ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రావెలింగ్ , తన హాబీస్ కోసం మాత్రమే డబ్బు ఖర్చు పెడుతున్నట్లు, అనవసరమైన లగ్జరీ వస్తువులపై రూపాయి కూడా వేస్ట్ చేయనని స్పష్టం చేశాడు.
అసలు ఇతని జీతం ఎంత? సేవింగ్స్ ఎంత?
రేమండ్ బేసిక్ శాలరీ నెలకు దాదాపు రూ.7.6 లక్షలు. దీనికి బోనస్‌లు, కంపెనీ స్టాక్స్ (షేర్లు) అన్నీ కలిపితే ఏడాదికి అతని ప్యాకేజీ రూ.3 కోట్లు దాటుతుంది. అతని మొత్తం జీతంలో దాదాపు 60 శాతం బోనస్, స్టాక్స్ రూపంలోనే వస్తుంది.
టాక్సులు, రిటైర్మెంట్ ఫండ్స్ అన్నీ కట్ అవ్వగా.. ప్రతి నెల అతని చేతికి వచ్చే నెట్ శాలరీ దాదాపు రూ.4 లక్షలు. అయితే బోనస్‌లు వచ్చిన నెలల్లో అతను ఏకంగా రూ.5 లక్షల నుండి రూ.19 లక్షల వరకు పొదుపు (Savings) చేస్తుంటాడు. మరి ఇంత డబ్బును అతను ఏం చేస్తున్నాడో తెలుసా?
30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్లాన్!
రేమండ్ జీవితంలో అతిపెద్ద లక్ష్యం ఏంటంటే.. చాలా త్వరగా ఉద్యోగం నుండి రిటైర్ అవ్వడం. దీనికోసం అతను 'FIRE' (Financial Independence, Retire Early) అనే కాన్సెప్ట్‌ను బలంగా నమ్ముతున్నాడు. అందుకే వచ్చే జీతాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా.. స్టాక్ మార్కెట్, రిటైర్మెంట్ అకౌంట్లలో చాలా అగ్రెసివ్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
అతని అంచనా ప్రకారం, ఈ రకమైన సేవింగ్స్ ద్వారా అతను 30 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.2 కోట్లకు పైగా, అలాగే 40 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా రూ.60 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను బిల్డ్ చేయగలడు. మనకు నచ్చిన జీవితాన్ని మనం ముందే ప్లాన్ చేసుకుని, దానికోసం డబ్బు దాచుకోవాలనేదే తన పాలసీ అని రేమండ్ చెప్తున్నాడు.


Click it and Unblock the Notifications