Layoffs: టెక్కీలకు ఊహించని వెన్నుపోటు.. ఏఐ టూల్స్ చేయించుకుని.. ఆ వెంటనే ఉద్యోగాల్లోంచి పీకేశారు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవ శ్రమను భర్తీ చేస్తుందా? టెక్కీల ఉద్యోగాలను మింగేస్తుందా? అనే భయాలు ఐటీ రంగంలో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ భయం ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. మెటా కంపెనీ తన చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్ (layoffs) ప్రక్రియను చేపట్టి ఏకంగా 8,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, దీని వెనుక ఉన్న ఒక షాకింగ్ ఇన్‌సైడ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ కొత్త చర్చకు దారితీసింది.
కంపెనీ తమను ఉద్యోగాల్లోంచి తీసేయడానికి కొద్దిరోజుల ముందే.. తమ చేతులతోనే అంతర్గత AI టూల్స్ బిల్డ్ చేయించుకుందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

'AI వీక్' పేరుతో పెద్ద స్కెచ్?
'జులియన్' అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. అతని కథనం ప్రకారం.. మెటా కంపెనీ కొన్ని నెలల క్రితం ఆఫీస్‌లో 'AI వీక్' అనే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఆ సమయంలో ఉద్యోగుల రెగ్యులర్ బాధ్యతలను పక్కనబెట్టి, కేవలం AI ప్రోటోటైప్‌లు, అంతర్గత టూల్స్ తయారు చేయడంపైనే ఫోకస్ పెట్టాలని యాజమాన్యం ఆదేశించింది.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జులియన్ భార్య కూడా మెటాలోనే పని చేసేది. తన ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోలోపల భయపడుతూనే, సీనియర్ ఇంజనీర్లతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి ఒక అద్భుతమైన AI టూల్‌ను డెవలప్ చేసింది. కానీ, సీన్ కట్ చేస్తే.. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన కొద్దిరోజులకే కంపెనీ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఆమె చేతికి పింక్ స్లిప్ ఇచ్చి పంపించేశారు! అంటే, ఉద్యోగుల చేతనే పనులు చేయించుకుని, ఆ పనులను AI కి అప్పగించి, మనుషులను బయటకు పంపించేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి ఊడిన ఉద్యోగాలు!
ప్రస్తుతం మెటా సింగపూర్, యూరప్, అమెరికా వంటి దేశాల్లో విడతల వారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. కొందరికైతే తెల్లవారుజామున 3 గంటలకు, 4 గంటలకు ఈమెయిల్స్ పంపి ఉద్యోగం ఊడిపోయిందని షాక్ ఇచ్చారు. చిన్న టీమ్స్‌తో, వేగంగా పనులు పూర్తి చేయడం కోసమే ఈ రీస్ట్రక్చరింగ్ అని మెటా హెచ్ఆర్ హెడ్ జానెల్ గేల్ చెప్తున్నప్పటికీ.. అసలు కారణం AI అనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది.
మరోవైపు, వేలాది మంది ఉద్యోగులను AI విభాగంలోకి మారుస్తున్నట్లు సమాచారం. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్‌లో AI కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఉద్యోగుల తొలగింపుతో రూ.25,000 కోట్ల ఆదా!
ఈ ఏడాది మెటా కంపెనీ కేవలం AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల కోసమే ఏకంగా 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తోంది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి ప్రత్యర్థులకు పోటీగా ఈ రేసులో నిలవాలని చూస్తోంది. అదే సమయంలో ఈ లేఆఫ్స్ (layoffs) ద్వారా కంపెనీకి దాదాపు 3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.25,000 కోట్లు) ఆదా అవుతుందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక కంపెనీలో మిగిలి ఉన్న ఉద్యోగుల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. తాము చేసే ప్రతి డివైజ్ యాక్టివిటీని కంపెనీ ట్రాక్ చేస్తూ, దాన్ని AI కి ట్రైనింగ్ ఇవ్వడానికి వాడుకుంటోందని సుమారు 1,000 మంది ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదేమైనా.. 'మనం పెంచిన మొక్కే మనపై విషం చిమ్మినట్టు', ఉద్యోగులు తయారు చేసిన టెక్నాలజీనే వారి ఉద్యోగాలను మింగేయడం ఇప్పుడు ఐటీ రంగాన్ని వణకిస్తోంది.


Click it and Unblock the Notifications