AI బదులు ఈ ఉద్యోగాలను నమ్ముకోండి.. మెటాలో 8 వేల మందిని పీకేసిన తర్వాత జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఉద్యోగాలను రద్దు చేయడం లేదని, అది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాదిస్తున్నారు. అయితే ఆయన చెబుతున్న ఆ కొత్త ఉద్యోగాలు సిలికాన్ వ్యాలీలోని కార్పొరేట్ టెక్ కార్యాలయాల్లో కాకుండా.. క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాల రంగంలో క్రియేట్ అవుతున్నాయి. మెటా ఇటీవల దాదాపు 8వేల మంది ఉద్యోగులను తొలగించి.. మరో 7,000 మందిని ఏఐ ప్రాజెక్టులకు బదిలీ చేసింది.
ఏఐ సాంకేతికత అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 2026 నాటికి 130 బిలియన్ డాలర్ల నుండి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. వేలాది కార్పొరేట్ ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీ.. భారీ డేటా సెంటర్లను నిర్మించే నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, కూలింగ్ ఇంజనీర్లు, పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిపుణులకు ఈ ఏఐ విస్తరణ ద్వారా విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని జుకర్‌బర్గ్ చెబుతున్నారు.

ప్రస్తుతం మెటా ప్రపంచవ్యాప్తంగా 32 డేటా సెంటర్లను నిర్వహిస్తుండగా.. తన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఈ ఏడాది 7 గిగావాట్లకు, 2027 నాటికి 14 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సాంప్రదాయక టెక్ ఉద్యోగాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు, విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు వంటి భౌతిక పనులకు డిమాండ్ పెరిగింది. ఏఐ సంబంధిత ప్రాజెక్టులు నికరంగా చాలా ఉద్యోగాలను సృష్టించాయని, సామూహిక నిరుద్యోగం వస్తుందన్న భయాలు నిజం కాలేదని జుకర్‌బర్గ్ వాల్ స్ట్రీట్ జర్నల్‌తో వ్యాఖ్యానించారు.
అయితే మెటా అంతర్గతంగా పరిస్థితి మరోలా ఉంది. కంపెనీ చేపట్టిన ఏఐ-కేంద్రీకృత పునర్వ్యవస్థీకరణ వల్ల మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. పలువురికి తెల్లవారుజామునే లేఆఫ్ ఈమెయిళ్లు అందడం, కొత్తగా చేరిన వారు సైతం వారాల వ్యవధిలోనే ఉద్యోగాలు పోగొట్టుకోవడం వంటి సంఘటనలు జరిగాయి.
ఉద్యోగులలో ఈ కోతలకు ముందే చాలా అసంతృప్తి నెలకొంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో కీస్ట్రోక్‌లు, మౌస్ కదలికలు, స్క్రీన్ యాక్టివిటీని ట్రాక్ చేసే మెటా యొక్క డేటా సేకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వెయ్యి మందికి పైగా సిబ్బంది పిటిషన్‌పై సంతకం చేశారు. మరోవైపు బిగ్ టెక్ కంపెనీల మధ్య ఏఐ మౌలిక సదుపాయాలకై తీవ్ర పోటీ నడుస్తోంది.
2026 నాటికి ప్రధాన టెక్ కంపెనీల మొత్తం ఏఐ పెట్టుబడులు 700 బిలియన్ డాలర్లు దాటవచ్చని అంచనా. ఇందులో ఆల్ఫాబెట్ 205 బిలియన్ డాలర్లు, మైక్రోసాఫ్ట్ 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ భారీ పెట్టుబడుల నుండి తక్షణ రాబడి రాకపోవడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. మెటా రెండవ త్రైమాసిక ఉచిత నగదు ప్రవాహం 91 శాతం పడిపోయి 784 మిలియన్ డాలర్లకు చేరడంతో కంపెనీ షేర్లు 10 శాతం క్షీణించాయి.
మెటా వద్ద ఉన్న భారీ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆంత్రోపిక్ వంటి కంపెనీలు ముందుకు వచ్చినప్పటికీ.. స్వల్పకాలిక లాభాల కోసం డేటా సెంటర్ల సామర్థ్యాన్ని బయటవారికి అద్దెకు ఇవ్వబోమని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. స్వంత ఏఐ మోడళ్లను, పర్సనల్ అసిస్టెంట్లను అభివృద్ధి చేసుకోవడానికే ఈ సామర్థ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. చివరిగా ఏఐ సాంకేతికత ఖచ్చితంగా ఉద్యోగాలను సృష్టిస్తోంది.
కానీ అవి టెక్నాలజీలో కాకుండా నిర్మాణ రంగాలు, విద్యుత్ ప్రాజెక్టులలో వస్తున్నాయి. వేలాది మంది కార్పొరేట్ ఉద్యోగులకు ఏఐ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతున్నాయా లేక పోతున్నాయా అనే దానికంటే.. ఏ రకమైన ఉద్యోగాలు కనుమరుగై ఎటువంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అలాగే ఈ పరిణామంలో ఎవరు వెనుకబడిపోతున్నారనేదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది.


Click it and Unblock the Notifications
