మార్క్ మామ మీద నమ్మకం లేదంటున్న ఉద్యోగులు.. బిలియనీర్ కంపెనీలో ఏం జరుగుతోంది..?
Mark Zuckerberg: అమెరికాకు చెందిన అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజం మెటా. అదే మనందరికీ తెలిసిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ. గత కొంత కాలంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కంపెనీలో ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంపెనీ ఇటీవలి నెలల్లో వేల మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిలో టెక్నికల్ టీమ్స్ కి సంబంధించిన అనేక మంది ఉపాధి కోల్పోయారు. దీని తర్వాత కంపెనీలో అంతర్గతంగా చేపట్టిన ఒక సర్వే సంచలనంగా మారింది. ఇందులో కేవలం నాలుగో వంతు మంది మాత్రమే మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై నమ్మకంగా ఉన్నారని తేలింది. సీఈవో పనితీరు సంతృప్తికరంగా లేదని ఎక్కువ మంది చెప్పటం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మెుత్తం ఉద్యోగుల్లో 26 శాతం మంది మాత్రమే మార్క్ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నట్లు సర్వే వెల్లడించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అక్టోబర్ 2022లో చేపట్టిన అభిప్రాయసేకరణ కంటే ఇప్పుడు 5 శాతం మంది తక్కువ నమ్మకాన్ని వెల్లడించారు. మార్చిలో నిర్వహించిన అతిపెద్ద లేఆఫ్ కి ముందుగానే ఈ అంతర్గత సర్వే జరగగా అందులో 43 శాతం మంది విలువైనదిగా భావించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు మెటాలో పనిచేస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత, మాజీ ఉద్యోగులు అంటున్నారు.
వ్యాపారాల్లో వచ్చిన ఆర్థిక అనిశ్చితులను దాటేందుకు గత ఏడు నెలలుగా మెటా చేపట్టిన సమగ్ర పునర్నిర్మాణ చర్యలు నాయకత్వ విశ్వాసంలో క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి మెటా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించటంతో పాటు కొన్ని ప్రాజెక్టులను తాత్కాలికంగా లేదా పూర్తి నిలిపివేసింది. ఇవ్వన్నీ ఖర్చులను తగ్గించుకునేందుకేనని అప్పట్లో కంపెనీ వెల్లడించింది.
దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మార్క్ జుకర్ బర్గ్ నాయకత్వంలోని పరిస్థితులు ప్రస్తుతం గందరగోళానికి కారణమౌతున్నాయి. సీఈవో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇంతలో తాను కంపెనీని ఎలా తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలనుకుంటున్నాననే ప్లాన్ గురించి ఉద్యోగులకు చెప్పాడు. ఏఐ వినియోగం, మెటావర్స్ వంటి ప్రణాళికల గురించి వెల్లడించారు. మెుత్తానికి వేలాది మంది మెటా ఉద్యోగులు ప్రస్తుతం మార్క్ పనితీరుతో సంతృప్తికరంగా లేరని తాజా సర్వే ప్రకారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications