Layoffs: ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు లేఆఫ్ ప్రకటించాయి. లక్షలాది మంది ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్ల వరకు మాంద్యం పరిస్థితులకు తలొగ్గక తప్పలేదు. ఓ పక్క ఆర్థిక అనిశ్చితి తొలగిపోతోందని కొందరు నిపుణులు చెబుతుండగా.. పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఓసారి ఉద్యోగాల్లో కోతలు విధించిన కంపెనీలు.. మరో రౌండ్ లేఆఫ్ లకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టెక్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

5 వేల పొజిషన్లు తొలగింపు
రానున్న రోజుల్లో మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా మంగళవారం ప్రకటించింది. మరో 5 వేల ఓపెన్ పొజిషన్లను సైతం తీసివేస్తున్నట్లు సిబ్బందికి సంస్థ సీఈవో జుకర్ బర్గ్ సమాచారం ఇచ్చారు. ఇంకో 2 నెలల్లో ఈ విషయంపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రీస్ట్రక్చరింగ్ ప్లాన్ గురించి ప్రభావిత సిబ్బందికి ఆయా విభాగాల లీడ్స్ తెలియజేస్తారన్నారు. తక్కువ ప్రాముఖ్యమున్న వివిధ ప్రాజెక్టులను సైతం రద్దు చేసుకోనున్నట్లు తెలిపారు.

నష్టాలు వచ్చినా మరిన్ని పెట్టుబడులు
మెటాను ఈ ఏడాదిలో మరింత చురుకుగా, స్థితిస్థాపకంగా నడిపించాలని జుకర్ బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా తమ సంస్థ ఆపరేషన్స్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు గత నెలలో ప్రకటించారు. పర్ఫామెన్స్ సరిగా లేని పలువురిని తొలగించి మిడిల్ మేనేజ్మెంట్ ప్లేయర్స్ ను తగ్గించాలని చూస్తున్నట్లు అప్పుడే స్పష్టం చేశారు.
ఇప్పుడు దాన్ని ఆచరణలోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో సంస్థ భారీ నష్టాలను చవిచూసినప్పటికీ వర్చువల్ ఆగ్ మెంటెడ్ రియాలిటీలో మాత్రం బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతూనే ఉంది.

4 నెలల్లోనే మరోసారి రెడీ..
గత నవంబర్ 2022లో మొదటిసారిగా మెటా లేఆఫ్ లను ప్రకటించింది. ఆ ఉద్యోగాల కోత ద్వారా మొత్తం సిబ్బందిలో 13 శాతం మంది ప్రభావితమయ్యారు. అయితే 11 వేల మందిని తొలగించిన 4 నెలలలోపే మరోసారి ఈ నిర్ణయం వెలవడటం కొంత ఆందోళన కలిగిస్తోంది.
రెండోసారి లేఆఫ్ లకు సిద్ధమైన దిగ్గజ సంస్థగా మెటా నిలిచింది. ఇవే చివరివా లేదా భవిష్యత్తులో మరిన్ని రౌండ్లు ఉద్యోగాల కోత ఉంటుందా అని తెలియని పరిస్థితి నెలకొన్నట్లు ఉద్యోగార్థులు ఆవేదన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications