ఒక ఏడాది ముగిసింది. మరో ఏడాది ప్రారంభం కాబోతుంది. సహజంగానైతే ఇంతే కదా? కానీ నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందంటే ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో సిద్ధమవుతారు. చాలా అలవాట్లు మార్చుకుంటారు. తీర్మానాలు చేసుకుంటారు. అందరి లాగే ఇండియన్ స్టార్టప్ కంపెనీలు కూడా 2020 వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
ఇప్పటి వరకు ఫండింగ్ వచ్చిన కంపెనీలు నెక్స్ట్ లెవెల్ ఫండింగ్ కోసం ప్రెసెంటేషన్ సిద్ధం చేస్తుండగా , అసలు పెట్టుబడులే రాని స్టార్టుప్ లు ఎలాగైనా ఇన్వెస్ట్మెంట్ సంపాదించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. సరైన అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే, వారి ఆశలు ఈ కొత్త సంవత్సరంలో అంతలా తీరేలా లేదని తెలుస్తోంది. ఈ రంగాన్ని దగ్గరగా చూస్తున్న నిపుణులు, పెట్టుబడిదారులు ఈ విషయాన్నీ చెబుతున్నారు. దీంతో స్టార్టుప్ కంపనీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ది ఎకనామిక్ టైమ్స్ ఈ అంశంపై ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో నుంచి కొన్ని విషయాలు మీకోసం.

వాల్యుయేషన్ తగ్గే అవకాశం...
స్టార్టుప్ కంపెనీలకు ఈ ఏడాది (2019) బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. డీల్స్ పరిమాణం పరంగా చూసినా, సంఖ్యా పరంగా చూసినా అది స్పష్టమవుతుంది. కానీ వచ్చే ఏడాది అలా ఉండబోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2018 తో పోల్చితే 2019 లో ఎర్లీ స్టేజి స్టార్టుప్ కంపెనీల డీల్స్ సుమారు 70% పెరిగి 693 మిలియన్ డాలర్స్ (సుమారు రూ 4,900 కోట్లు) కు పెరిగాయి. 2018 లో ఇవి కేవలం 334 మిలియన్ డాలర్లు గా ఉన్నాయి. ఇందులో దాదాపు 50% వరకు డీల్స్ అధిక వాల్యుయేషన్ పొందాయని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. అందుకే 2020 లో వాల్యుయేషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా బిజినెస్ టు కన్స్యూమర్ (బీ 2 సీ )స్టార్టుప్ కంపెనీలకు 2020 కష్టకాలమేనని, ఆ విభాగంలో అధిక సంఖ్యలో కంపెనీలు పోటీ పడుతుండటమే అందుకు కారణమని ఇన్నోవేన్ కాపిటల్ ఇండియా సీఈఓ ఆశిష్ శర్మ వెల్లడించారు. కొత్త వినియోగదారుని సంపాదించేందుకు ఎంత ఖర్చు చేయటానికైనా ఈ స్టార్టుప్ కంపెనీలు వెనుకాడటం లేదు. దాంతో ఆదాయం కంటే ఖర్చు రెట్టింపుకంటే కూడా అధికంగా ఉంటోంది.

కొనుగోళ్లు, విలీనాలు...
కొత్త ఏడాదిలో స్టార్టుప్ కంపెనీల్లో కొత్త పోకడ కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా వరకు కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు (మెర్జర్స్ అండ్ ఆక్విజిషన్స్) జరుగుతాయని అంటున్నారు. పెట్టుబడులు రాకపోవటంతో పాటు ఆదాయార్జన పెంచుకొనే క్రమంలో స్టార్టుప్ కంపెనీలు ఒత్తిడికి లోనవుతాయని, ఆ నేపథ్యంలో అవి తప్పనిసరిగా ఎగ్జిట్ మార్గాన్ని ఎంచుకొంటాయని విశ్లేషిస్తున్నారు. అయితే, కేటగిరి వారీగా సేవలు అందించే స్టార్టుప్ కంపెనీలకు 2020 లో కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందని, కానీ అందులో కొన్ని మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు. 2020 లో అధికంగా కన్సాలిడేషన్ జరుగుతుందని వెంచర్ డెట్ ఫండ్ అల్టెరియా కాపిటల్ ఎండీ వినోద్ మురళి వ్యాఖ్యానించారు. అయితే కష్టకాలం కూడా కొంతవరకు మంచిదేనని అయన తెలిపారు. మంచి టీం, పటిష్టమైన ప్రణాళికలు ఉన్న కంపెనీలకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

ఒకరికి ఒకరు...
భారత్ లో స్టార్టుప్ కంపెనీల ప్రస్థానం కొంత మెచూరిటీ స్థాయికి చేరుకుందని చెప్పాలి. ఒకప్పుడు ఒక స్టార్టుప్ కంపెనీ పెడితే దానికి అవసరమైన అన్ని విభాగాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఓలా వంటి కంపెనీ ఇప్పుడు పేమెంట్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే యుపీఐ ఉండనే ఉంది. అదే సమయంలో ఒక కొత్త ఈ కామర్స్ కంపెనీ సొంతంగా డెలివరీ నెట్వర్క్ అభివృద్ధి చేసుకోవాల్సిన పనిలేదు. అందుకోసం డెలివరీ, ఈ కార్ట్ వంటి కంపెనీలు ఉండనే ఉన్నాయి. అందుకే ఒకప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ మరో స్టార్టుప్ కంపెనీపై ఆధారపడి పని చేసే ఏకోసిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఒకరికొకరు అనే కాన్సెప్ట్ వల్ల ఈ రంగంలో చాలా కాపీ కాట్స్ పని తగ్గుతుంది. అదే సమయంలో ఎవరి కోర్ బిజినెస్ పై వారు దృష్టి సారించేందుకు అవకాశం లభిస్తుంది. సరిగ్గా స్టార్టుప్ కంపెనీలకు 2020 ఇదే సూత్రాన్ని మరింత స్పష్టంగా చెప్పబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వృధాను తగ్గించి లాభాల బాటలో పయనించేందుకు కొత్త ఒరవడి ప్రారంభం కాబోతోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications