గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ రోజు ఉదయానికి చూస్తే Multi Commodity Exchange of India (MCX)లో పసిడి, సిల్వర్ ధరలు కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అస్థిరత పరిస్థితులకు కొనసాగింపుగా ఈ తగ్గుదల కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే అమెరికా ద్రవ్య విధానాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఇంటర్నేషనల్, నేషనల్ మార్కెట్లలో బంగార ధరలు తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. భవిష్యతుల్లో బంగారం, సిల్వర్ ధరలు మార్పులపై పెట్టుబడిదారులు ఆచితూచి ఆలోచన చేస్తున్నారు.
తాజాగా చూసుకున్నట్లయితే.. ప్రపంచ మార్కెట్లలో బలహీనత, అమెరికా ద్రవ్య విధానంపై మారుతున్న అంచనాలు, అలాగే డాలర్ విలువలో జరుగుతున్న కదలికలు విలువైన లోహాలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, తాత్కాలిక లాభాల బుకింగ్‌కు మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. MCXలో ఏప్రిల్ 2026 గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 1,210 లేదా 0.80 శాతం తగ్గి సుమారు రూ. 1.53 లక్షలకు చేరింది. ఇదే సమయంలో మార్చి 5, 2026 సిల్వర్ ఫ్యూచర్స్ ధర కిలోగ్రాముకు రూ. 4,685 లేదా దాదాపు 2 శాతం తగ్గి రూ. 2.35 లక్షల స్థాయికి పడిపోయింది. ఈ ధరల పతనం ఒక్కరోజులోనే కాకుండా గత కొన్ని సెషన్లుగా కొనసాగుతుండటం మార్కెట్‌లోని బలహీన సెంటిమెంట్‌ను సూచిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా Gold, Silver ధరలు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాయి. స్పాట్ గోల్డ్ సుమారు 4,900 డాలర్ల స్థాయిలో ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ 74-75 డాలర్ల పరిధిలో కదులుతోంది. అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ ఇండెక్స్‌లోని మార్పులు ఈ కదలికలకు ప్రధాన కారణాలుగా మారాయి. జనవరిలో అమెరికా ద్రవ్యోల్బణం రేటు 2.40 శాతంగా నమోదవడం వల్ల, Federal Reserve 2026లో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించవచ్చనే అంచనాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ వచ్చే ఏడాది రెండు రేటు కోతలు జరిగే అవకాశం ఉందని భావిస్తోంది.
సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం ఎటువంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వదు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఇతర వడ్డీ ఆధారిత పెట్టుబడుల ఆకర్షణ తగ్గి.. బంగారం వంటి విలువైన లోహాల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారు. అలాగే డాలర్ బలహీనపడితే ప్రపంచవ్యాప్తంగా బంగారం మరింత సరసమైనదిగా మారుతుంది. ఇది డిమాండ్ పెరగడానికి దోహదపడుతుంది. డిమాండ్ పెరిగితే ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అందువల్ల ద్రవ్య సడలింపు అంచనాలు నిజమైతే, దీర్ఘకాలికంగా బంగారం ట్రెండ్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉందని కమోడిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే వెండిలో ఎందుకు అంత ఎక్కువ అస్థిరత కనిపిస్తోందన్న ప్రశ్నకు నిపుణులు స్పష్టమైన కారణాలు చెబుతున్నారు. వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన పారిశ్రామిక లోహం కూడా. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఆటోమొబైల్ పరిశ్రమ వంటి అనేక రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది. అందువల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి, పరిశ్రమల ఉత్పత్తి గణాంకాలు, తయారీ రంగ సంకేతాలు వెండి ధరలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే బంగారంతో పోలిస్తే వెండి ధరలు ఎక్కువగా ఊగిసలాడతాయి.
ప్రస్తుతం వెండి కన్సాలిడేషన్ దశలో ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంటే పెద్ద పెరుగుదల లేదా పతనం ముందు ధరలు ఒక పరిమిత పరిధిలో కదిలే అవకాశం ఉంది. ఈ దశలో వచ్చే చిన్న వార్తలు కూడా ధరల్లో పదునైన కదలికలకు దారితీయవచ్చు.
ముందు రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను ప్రధానంగా అమెరికా ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలు, అలాగే డాలర్ ఇండెక్స్ కదలికలు నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్వల్పకాలంలో అస్థిరత కొనసాగవచ్చని.. అయితే సంభావ్య వడ్డీ రేటు కోతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలికంగా విలువైన లోహాలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా.. సమతుల్య వ్యూహంతో ముందుకెళ్లడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications