Tomato prices: పెరిగిన టమోటా ధరలు వంటింట్లో మంట రేపుతున్నాయి. సామాన్యులు కొనలేని స్థాయికి చేరి కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో టమోటా వినియోగానికి ప్రజలు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ప్రఖ్యాత అంతర్జాతీయ దిగ్గజ సంస్థ సైతం టమోటా ధరల ధాటికి విలవిల్లాడుతోందంటూ వార్తలు వస్తున్నాయంటే మార్కెట్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ తమ బర్గర్స్ సహా ఇతర ఆహార పదార్థాల్లో టమోటాలను విరివిగా ఉపయోగిస్తుంటుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో దీనికి బ్రాంచ్ లు ఉన్నాయి. కాగా నాణ్యమైనవి అందుబాటులో లేవంటూ ఆయా ఉత్పత్తుల తయారీలో టమోటా వినియోగాన్ని నిలిపివేసింది. అయితే కిలో టమోటా ధర 200కు చేరడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

'ధరల పెరుగుదల వల్ల టమోటా వినియోగాన్ని నిలిపివేయలేదు. వాతావరణ మార్పులే ఇందుకు కారణం. పంజాబ్-చండీగఢ్ ప్రాంతాల్లో తగిన పరిమాణంలో టమోటాలు లభిస్తున్నాయి. కాబట్టి అక్కడ మా మెనూలో వాటిని అందిస్తూనే ఉన్నాం. నియంత్రిత వాతావరణంలో పెంచడం సహా స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా మిగిలిన చోట్ల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం' అని మెక్ డొనాల్డ్స్ ఇండియా నార్త్-ఈస్ట్ ప్రతినిధి తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేయబడే వాటిని మాత్రమే తమ ప్రొడక్ట్స్ లో వినియోగిస్తామని ఆ ప్రతినిధి చెప్పారు. సీజనల్ పంట సమస్యల కారణంగా తమ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అవి అందుబాటులో లేవన్నారు. అందువల్ల అత్యుత్తమ ఉత్పత్తులను కస్టమర్లకు సర్వ్ చేయడంలో ఇబ్బంది తలెత్తుతోందని వెల్లడించారు.
బర్గర్‌ల వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని మెక్‌డొనాల్డ్స్ ఉత్పత్తుల్లో టమోటాలు లేకపోవడంపై సోషల్ మీడియాలో అలజడి కొనసాగుతోంది. కొందరు యూజర్స్ టమోటాలు లేని బర్గర్ల పిక్స్ షేర్ చేస్తున్నారు. మరికొందరు టమోటాలు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవడం గురించి కస్టమర్స్ కు తెలియజేసేందుకు మెక్‌డొనాల్డ్ స్టోర్స్ పెట్టిన నోటీసులను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications