మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆరంభించిన తరువాత పలు దేశాలు.. రష్యాను వాణిజ్యపరంగా దూరం పెట్టాయి. ఆంక్షలను విధించాయి. నిషేధాజ్ఞలను జారీ చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలన్నీ రష్యాపై వాణిజ్య యుద్ధాన్ని సాగిస్తోన్నాయి. చివరికి- విసా, మాస్టర్‌కార్డ్‌ల లావాదేవీలు కూడా రష్యాలో స్తంభించే పరిస్థితి ఏర్పడింది.

రష్యా.. బహిష్కరణ
పేమెంట్స్ సర్వీసెస్ కంపెనీ పేపాల్ కూడా తన సేవలన్నింటినీ రష్యాలో షట్‌డౌన్ చేసింది. తమ కంపెనీ సర్వీసులు ఏవీ కొంతకాలం పాటు రష్యాలో అందుబాటులో ఉండబోవని పేపాల్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడటాన్ని తాము సమర్థించట్లేదని, రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన అంతర్జాతీయ సమాజంతో తాము కూడా జత కలిశామని పేర్కొంది.

విసా, మాస్టర్ కార్డ్స్ సహా..
పేపాల్ బాటలోనే విసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా నడిచాయి. ఈ మూడు సంస్థలు కూడా రష్యాలో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రష్యా బ్యాంకులు జారీ చేసిన విసా, మాస్టర్ కార్డులు, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఏవీ పని చేయబోవని స్పష్టం చేశాయి. తమ నెట్‌వర్క్స్ ఎంతో కాలం పాటు అందుబాటులో ఎండబోవని తేల్చి చెప్పాయి.

కార్పొరేట్ కంపెనీలు సైతం..
దీనికి కొనసాగింపుగా తాజాగా పలు కార్పొరేట్ కంపెనీలు రష్యాతో తెగదెంపులు చేసుకున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం కీలక ప్రకటన వెలువడించింది. రష్యాలో తమ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద అకౌంటింగ్ ఫర్మ్స్‌లల్లో ఒకటైన డెలాయిట్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఎర్నెస్ట్ అండ్ యంగెస్ట్, ప్రైజ్ వాటర్ కూపర్స్, కేపీఎంజీ సైతం తమ కార్యకలాపాలను స్తంభింపజేశాయి.

మెక్‌డొనాల్డ్స్ సైతం..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్, శామ్‌సంగ్, ఎయిర్ బీఎన్బీ, గూగుల్, వోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్ బెంజ్.. ఇదివరకే తమ సర్వీసులను నిలిపివేశాయి. ఈ జాబితాలో ఒకటైన అమెరికన్ ఫుడ్ జెయింట్ మెక్‌డొనాల్డ్స్ కూడా రష్యాను బహిష్కరించిన విషయం తెలిసిందే.

పునరుద్ధరించబోమంటూ..
రష్యాలోని అన్ని రెస్టారెంట్లను మూసివేసింది. అక్కడి కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేసి.. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ వాటిని పునరుద్ధరించబోమని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ సమాజంతో కలిసి తాము సాగుతామంటూ అప్పట్లో సంచలన ప్రకటన చేసింది మెక్‌డొనాల్డ్ మేనేజ్‌మెంట్.
రీ ఎంట్రీ కోసం..
ఇప్పుడు పరిస్థితి మారింది. రష్యాలో మళ్లీ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు తెరచుకోనున్నాయి. రష్యా వ్యాప్తంగా 850 లొకేషన్లల్లో ఈ రెస్టారెంట్స్ మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ- మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు మళ్లీ రష్యాలో రీఓపెన్ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రీఓపెన్‌కు కారణాలేంటీ..?
దీనికి కారణాలు లేకపోలేదు. రష్యా వరకు మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ల యాజమాన్యం చేతులు మారడమే. సైబీరియాకు చెందిన సిస్టెమా పీబీఓ అనే దిగ్గజ ఆయిల్ కంపెనీ రష్యాలో మూతపడ్డ ఈ అవుట్‌లెట్స్ అన్నింటినీ టేకోవర్ చేసింది. వచ్చే వారమే వాటిని పునరుద్ధరించనుంది. దీనికోసం ఆ ఆయిల్ కంపెనీ ఎంత మొత్తాన్ని ఖర్చు చేసిందనేది ఇంకా తెలియరాలేదు. ఈ అవుట్‌లెట్లను రీఓపెన్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు కొంతవరకైనా మేలు కలుగుతుందని సిస్టెమా పీబీఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

కొత్త లోగోతో..
మెక్‌డొనాల్డ్స్ లోగోను మార్చేసింది సిస్టెమా పీబీఓ. కొత్త లోగోను రూపొందించింది. ఈ లోగోతోనే రష్యావ్యాప్తంగా 850 మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను పునరుద్ధరించబోతోంది. పేరు కూడా మారబోతోంది. టోట్ సామ్‌యి అనే పేరును ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. రష్యన్ భాషలో టోట్ సామ్‌యీ అంటే.. ది సేమ్ లేదా దట్ వన్ అని అర్థం. స్వొబొడ్నాయా కస్సా (అవైలబుల్ క్యాష్ రిజిస్టర్) అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.


Click it and Unblock the Notifications