Cyber Scams: టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతున్నామని సంతోషించాలో, దాని వినియోగంతో ప్రజలను మోసగిస్తున్న విధానాలను చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్న ప్రస్తుత సమయంలో.. ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీ మెకాఫీ (McAfee) అధ్యయనం విస్తు గొలిపే విషయాలను బయటపెట్టింది.
భారత్ లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నట్లు మోకాఫీ స్కామ్ మెసేజెస్ రీసెర్చ్ తెలిపింది. ఇ-మెయిల్, సాధారణ మెసేజ్ లు, సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ దాదాపు 12 నకిలీ, మోసపూరిత సందేశాలు ప్రజలు అందుకుంటున్నట్లు వెల్లడించింది. ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు, ఆఫర్లు, బ్యాంక్ అలర్ట్స్ వంటి వివిధ రూపాల్లో మోసగాళ్లు చెలరేగిపోతున్నట్లు పేర్కొంది. తద్వారా కోట్లాది రూపాయలను దోచేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

దేశంలో సర్వే చేయబడిన వ్యక్తుల్లో 64 శాతం మంది జాబ్ స్కామ్‌ల బారిన పడగా.. 52 శాతం మంది బ్యాంక్ అలర్ట్స్ పేరిట మోసాలకు బాధితులుగా మారినట్లు మోకాఫీ గుర్తించింది. అయితే 60 శాతం మంది తమకు వచ్చిన మెసేజ్ లను స్కామ్ సందేశాలుగా గుర్తించలేకపోయామని తెలిపినట్లు చెప్పింది. హ్యాకర్లు, మోసగాళ్లు AI టెక్నాలజీని ఉపయోగించడమే ఈ ధోరణికి కారణమని అధ్యయనం తేల్చింది.
'అందివచ్చిన సాంకేతికను వినియోగించి ఎటువంటి అక్షరదోషాలు, లోపాలు లేకుండా అత్యంత నమ్మశక్యంగా మెసేజ్ లు పంపిస్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు చెప్పారు. స్కామ్ సందేశాన్ని గుర్తించడం కంటే రూబిక్స్ క్యూబ్ ను పరిష్కరించడం తమకు సులభమని 73 శాతం మంది భారతీయులు నమ్ముతున్నారు' అని మోకాఫీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోమా మజుందర్ తెలిపారు.
అంతేకాకుండా సగటు భారతీయుడు వారానికి 105 నిమిషాలు మెసేజ్ లు, ఇమెయిల్, సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశాలు నిజమా లేదా నకిలీవా అని సమీక్షించడానికి, ధృవీకరించడానికి వెచ్చిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. AI-ఆధారిత స్కామ్‌ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. ప్రజలు డిజిటల్ కమ్యూనికేషన్‌లపై నమ్మకాన్ని కోల్పోతున్నట్లు గుర్తించింది.


Click it and Unblock the Notifications